ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది.
మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొట్టు సత్యనారాయణకు ఉప ముఖ్యమంత్రితో పాటు దేవదాయశాఖ బాధ్యతలు అప్పగించారు.
మంత్రి అయిన తరువాత కొట్టు సత్యనారాయణ మొట్టమొదట సారిగా తిరుపతి జిల్లాలో దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలోని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకోవడానికి విచ్చేశారు.
దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మొట్టమొదట సారిగా వస్తుండటంతో అధికారులు తమ స్వామి భక్తి చాటు కోవాలనుకున్నారు. మంత్రి పేరుతో సామాన్య భక్తులకు గంటల కొద్దీ దర్శనం ఆపేశారు.
వరుసగా రెండు రోజులు సెలవులు, అందులోనూ శుక్రవారం కావడంతో ముక్కంటిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సామాన్య భక్తులకు క్యూలైన్లలో కనీసం తాగునీటి సరఫరా కూడా చేయలేదు. గంటల కొద్దీ తాగునీరు లేక పోవడం.. రద్దీ అధికంగా ఉండటం.. గంటల కొద్దీ క్యూలైన్లలో ఉండాల్సి రావడంతో కొంతమంది భక్తులు అస్వస్థకు గురయ్యారు.
దర్శనానికి అనుమతించాలని కోరినా ఆలయ అధికారులు అంగీకరించలేదు. భక్తులు చాలా సేపు నిగ్రహించుకున్నారు. దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ రాగానే ఆయన వ్యతిరేకంగా ‘‘డౌన్ డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. భక్తులకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను నాలుగు గంటల పాటు క్యూలైన్లలో ఎలా ఆపుతారని నిలదీశారు.
భక్తులకు సర్ది చెప్పడానికి మంత్రి ఎంత ప్రయత్నించినా వారు మెత్తబడలేదు. ఆయనపై తిరుగుబాటు చేశారు. ఈ హఠాత్పరిణామంతో మంత్రికి ముచ్చెమటలు పట్టాయి. దీంతో ఆయన ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కాగా మంత్రి రాక సందర్భంగా సుమారు నాలుగు గంటల పాటు సామాన్య భక్తుల దర్శనం ఆపేసిన ముక్కంటి ఆలయ అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఐపీల పేరుతో భక్తులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు బాధ్యులైన వారికి కఠిన చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండు చేస్తున్నారు.


.