జీవితం జారుడుబల్లలా ఉంటుంది. ఒక శిఖరాన్ని ఒక ఉన్నతిని చేరుకోడానికి చాలా కష్టపడతాం.. ఆ తర్వాత.. మధ్యలో ఆగుతాం. జారుడు బల్ల మీదకు వెళ్లేప్పుడు కొద్దిగా సంకోచిస్తాం. ఒక్క అంగుళం జారామంటే చాలు.. ఇక మొత్తం క్షణాల్లో జారిపోతాం.. కిందికి చేరుకుంటాం.
జీవితంకూడా అంతే. ఒక స్థాయిని చేరుకోడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. నిచ్చెన ఎక్కినట్టుగానే.. ఒక్కొక్క మెట్టూ ఎక్కి అక్కడకు చేరుకోవాలి. విలువల పరంగా ప్రతిఒక్కరూ వారి వారి జీవితాలకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించుకుంటారు. ఆ ప్రమాణాల మీద నిలబడడమే జీవితం. వాటిలో ఏ కొద్దిగా జారిపోయినా.. ఇక ఆగరు.. ఆ జారుడు అలా కంటిన్యూ అవుతుంది. జారుతూనే ఉంటారు. మళ్లీ నేలమీదికి చేరుకునేదాకా ఏకబిగిన జారుకుంటారు.
ఇదే విషయాన్ని మనకు ఓ సుభాషితం చెబుతుంది.
యథా హి మలినైః వస్త్రైః యత్ర కుత్రోపవిశ్యతే
వృత్తతం చలితోపి ఏవం శేషం వృతం న రక్షతి
దుస్తులు అప్పటికే మురికిగా మారిపోయి ఉంటే గనుక.. బురదగా ఉంటే గనుక.. వాటిని ధరించి ఉన్న వ్యక్తి.. ఎక్కడ కూర్చోడానికైనా వెనుకాడడు. అంటే.. దుస్తులు మాసిపోతాయని, పాడైపోతాయనే భయం అతడికి ఉండదు. అలాగే విలువల విషయంలో కూడా ఒక్కసారి వాటిని కాస్త సడలించడం అంటూ జరిగితే.. ఇక పూర్తిగా సడలిపోవడమే ఉంటుంది. మిగిలిన విలువలు అన్నీ కూడా పోతాయి.. అనేది శ్లోక భావం.
వర్షాకాలంలో ఈ విషయం మనకు బాగా స్వానుభవంలోకి వస్తుంది. బయట బురదగా ఉంటే.. చాలా జాగ్రత్తగా బట్టలకు బురద అంటుకోకుండా అడుగులు వేస్తుంటాం. ఈలోగా.. ఎవడో ఒకడు బురద చిమ్మి.. బట్టలకు మురికి అంటుకుంటే.. ఇక పట్టించుకోం. ఒకసారి పాడైన తర్వాత.. ఇక ఎంత బురద అయితేమాత్రం ఏముందిలే.. అని యథేచ్ఛగా వెళ్లిపోతాం.
జీవితంలో విలువలు కూడా అంతే. మనం నమ్ముకున్న. మన జీవితానికి మనం నిర్దేశించుకున్న విలువల్ని మనం ప్రమాణంగా పాటిస్తూ ఉంటాం. కానీ.. ఒకసారి ఆ విలువల బాటనుంచి కొద్దిగా పక్కకు తప్పుకున్నామంటే చాలు.. ఇక విలువల గురించి పట్టింపు ఉండదు. అలా జారిపోతూనే ఉంటాం.
అందుకే మనం నమ్మిన విలువల్ని మనం ఎప్పటికీ కాపాడుకుంటూ ఉ:డాలి.
శుభోదయం.
ఇవి కూడా చదవండి :
సురేష్ పిళ్లె : ఒక మా ఎలక్షన్.. మీడియా ఓవరాక్షన్
రామ్ బాణం : జర్నలిస్టులకు నోబెల్ శాంతి బహుమతి.. జర్నలిజం ప్రపంచానికే స్ఫూర్తి
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
.

Discussion about this post