పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని ఐరాలమండలం కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి కొత్త శోభ సమకూరుతోంది. ఆలయంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన పురాతన కాణిపాకం ఆలయం ఇక నవ్యశోభను సంతరించుకోనుంది. ఇంత పురాతన ఆలయం కావడానికి తోడు.. ఒకటి రెండు దశాబ్దాలుగా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారిని సేవించుకునే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. భక్తుల తాకిడికి తగ్గట్టుగా ఆలయానికి కొత్తరూపు ఇవ్వడం అనేది అత్యావశ్యకం అయింది.
ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించే పనులు చేపట్టారు. ఇందుకు మొత్తం 8.75 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. విజయవాడకు చెందిన ఎన్నారై భక్తుడు ఐకా రవి ఆలయ పునర్నిర్మాణానికి వ్యయం కాగల పూర్తి మొత్తాన్ని విరాళంగా సమకూరుస్తున్నారు.
సుమారుగా అయిదు నెలలు కిందట మొదలైన పనులు- ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. అత్యద్భుతంగా అలరారే శిల్పకళ శోభిల్లేలా.. పనులు సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 2022 సంవత్సరం వినాయక చవితి నాటికి, వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల సమయానికి కొత్త ఆలయంలోనే వేడుకలు నిర్వహించాలనే సంకల్పంతో పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు.
ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులతో పాటూ.. ఇంకా అనేక అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. 3 కోట్ల రూపాయలతో లడ్డు పోటు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, 2 కోట్ల రూపాయలతో అగరం పల్లి నుంచి కాణిపాకం వరకు వంద అడుగుల వెడల్పుతో సిమెంటురోడ్డు నిర్మించే పనులు కూడా సాగుతున్నాయి.
ఇవన్నీ పూర్తయితే గనుక.. కాణిపాకం ఆలయానికి అత్యద్భుతమైన నవ్యశోభ సమకూరుతుంది. దాంతో పాటూ.. కాణిపాకం చేరుకునేందుకు భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులు కూడా తొలగుతాయి. స్థానికంగా భక్తులకు వసతి సౌకర్యాలను మెరుగుపరిచే పనులు కూడా జరుగుతున్నాయి.
Discussion about this post