తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వజన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదారదేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి.
వాహనసేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు శేషగిరి, మధుసుదన్, ఏవిఎస్వో వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
.

Discussion about this post