ఆడ బిడ్డలకు రక్షణ కల్పించాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష డిమాండు చేశారు. సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరులో బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండు చేస్తూ ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చక్రాల ఉష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండన్నర ఏళ్లలో 600మందికి పైగా ఆడబిడ్డలపై అత్యాచారం జరిగిందన్నారు. ఇందులో ఏ ఒక్కరికీ న్యాయం జరుగలేదన్నారు.
దిశ చట్టం కాగితాలకే పరిమితం అయిందన్నారు. ప్రభుత్వం చేతగాని తనంతోనే ఆడబిడ్డలపై అత్యాచారాలు పెరిగి పోతున్నాయని చక్రాల ఉష అభిప్రాయపడ్డారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే కొందరు ఈ అత్యాచారాలకు తెగబడుతుండటం ఆవేదన కలిగించే అంశమన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఇటీవల ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రేమ పేరుతో మోసం చేయడంతో వలంటీరుగా పని చేసే ఓ యువతి ఆత్మహత్య చేసుకుదన్నారు.
ఆ సంఘటన మరువక మునుపే శ్రీకాళహస్తిలోనే ఏడేళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డారని ఆమె చెప్పారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో ఓ యువతిపై ఓ పోలీస్ అత్యాచారం చేశారన్నారు. గుంటూరు జిల్లాలో 14ఏళ్ల బాలికను కొంతమంది యువకులు మాయమాటలతో వ్యభిచార కూపంలోకి దించిన సంఘటన ఇటీవలనే వెలుగు చూసిందని చక్రాల ఉష గుర్తు చేశారు.
చెప్పకుంటూ పోతే ఇలాంటి సంఘటనలు కోకొల్లలన్నారు. ఈ సంఘటనలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి కానీ, హోం మంత్రి కానీ, మహిళా కమిషన్ కానీ నోరు మెదపక పోవడం బాధాకరమన్నారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెప్పాలని ఉష కోరారు.
ఇక సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జి జేడీ రాజశేఖర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి 600మందికి పైగా ఆడబిడ్డలు అత్యాచారానికి గురయ్యారన్నారు. వీరిలో ఏ ఒక్కిరికీ న్యాయం జరుగలేదన్నారు. జగన్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. ఇకనైనా మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం నిద్ర లేచి ఆడబిడ్డలను కాపాడే దిశగా పని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఉపాధ్యక్షులు సతీష్ నాయుడు, అడహాక్ కమిటీ సభ్యుడు తిరుమలరెడ్డి, భాస్క,ర్ గోవిందస్వామి, ప్రభాకర్ నాయుడు, సురేష్, ఝాన్సీ, జనీతా, రజని నాగరాణి, నoదగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
.