ఇటీవల కురిసిన భారీ వర్షాల తాకిడికి ఇబ్బందులు పడ్డ వరద బాధితులను ప్రతి ఒక్కరిని గుర్తించాలని స్థానిక ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి కోరారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో ఆమె వరద పరిస్థితిపై వీఆర్వోలు, పంచాయతీ సెక్రెటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు వారాలుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురికావడం జరిగిందన్నారు.
ముఖ్యంగా మండలంలోని 28 పంచాయతీలలో పలు ఎస్సీ ,ఎస్టి ,బీసీకాలనీలు జలమయమైనటు ఆమె గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మరోమారు క్షేత్రస్థాయిలో పంచాయతీ సెక్రెటరీ సహకారంతో పరిశీలించి బాధితులను గుర్తించాలని సూచించారు.
నియోజకవర్గంలో మిగిలిన మండలాలు కన్నా బాధితుల సంఖ్య సత్యవేడులో తక్కువగా ఉందన్నారు. ఉరుస్తున్న ఇళ్లను, ఇళ్లలోకి నీరు చొరబడిన వాటిని గుర్తించి బాధితులను నమోదు చేయాలని ఆమె కోరారు. వరద బాధితులు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. బాధ్యతలు ఎవరు నష్టపోకుండా చూడాలని ఆమె రెవెన్యూ అధికారులను కోరారు.
ఇందుకు సంబంధించిన బాధితుల జాబితాను శుక్రవారం మధ్యాహ్నం లోపు అందించాలన్నారు. అలాగే నవంబర్ 27 నుంచి మరోసారి తుఫాను ప్రభావం వల్ల కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
మండలంలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సమీప పునరావాస కేంద్రాలకు తరలించడానికి తగు చర్యలు చేపట్టడంలో సర్వదా సన్నద్ధంగా ఉండాలని ఆమె అధికారుల బృందానికి స్పష్టం చేశారు. వర్షపు నీరు భారీగా నిలిచే లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రమాద సూచికలను ఎదురు వేయాలన్నారు.
అలాగే ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని ఆయా గ్రామాల చెరువుల పరిస్థితిని అంచనావేసి ఎప్పటికప్పుడు మండల అధికారులకు సమాచారం ఇచ్చే బాధ్యత ఆయా వీఆర్వో ,పంచాయతీ సెక్రెటరీపై ఉన్నట్టు ఆమె గుర్తు చేశారు .వరద బాధితులను ఆదుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంపూర్ణ సహకారం ఎల్లవేళలా అందించడానికి సం సిద్ధంగా ఉన్నట్టు ఆమె గుర్తు చేశారు .ఎమ్మెల్యే ఆశయానికి అనుగుణంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల ఇబ్బందులను ,వారి సమస్యలను తీర్చాలని ఆమె కోరారు .
ఈ కార్యక్రమంలో ఆర్ఐ కిరణ్ కుమార్ ,సత్యవేడు పంచాయతీ సెక్రెటరీ ముని వాసులు ,విఆర్వోలు ఇళయరాజా ,మధుబాబు , సురేష్ ,నాగభూషణం ,త్రివేణి ,నిఖిత ,నిరీష్ కుమార్ , భార్గవ్ , పంచాయతీ సెక్రెటరీలు రమణమూర్తి ,శైలేంద్ర కుమార్ ,మాధవి ,కుముద ,రజిత ,మనోజ్ ,వాసు తదితరులు పాల్గొన్నారు .
.