నూతన ఏడాదిలో కొత్త ఆలోచనలు నింపుదామని సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి జేడీ రాజశేఖర్ అన్నారు. సత్యవేడు నియోజకవర్గం నాగలాపురంలో శుక్రవారం తెలుగు మహిళల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ మీద అవగాహనా కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా జేడీ రాజశేఖర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు. ప్రకృతి, సమాజం మనకు ఎంతో మేలు చేస్తున్నాయని… ఈ నేపథ్యంలో మన వంతు సమాజానికి కొంత మేలైనా చేయాలన్నారు.
ప్రకృతి పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమం లా చేపట్టాలని… ప్రతి ఒక్కరూ వారి ఇళ్ళ ముందు ఖచ్చితంగా మొక్కలు నాటి… అవి పెరిగే వరకూ పూర్తి భాద్యత వహించాలని కోరారు.
అనంతరం తిరుపతి పార్లమెంట్ తెలుగుమహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష మాట్లాడుతూ నూతన ఆంగ్లసంవత్సరo లోకి అడుగు వేయబొయే ముందు భవిష్యత్ తరాల వారి గురించి ఒకసారి ఆలోచించాలని మనవి చేశారు.
ఈ రెండేళ్లల్లో కరోనా చాలా పాఠాలు నేర్పిందని… ఇకనైనా పర్యావరణం మీద భాద్యత వహించక పోతే బావితరాల భవిష్యత్ అంధకారంలో మునిగే ప్రమాదం ఉందన్నారు. కొందరి స్వార్ధం వలన కొండలు, చెరువులు, గుట్టలు, నదులు, అడవులు సైతం మాయం అవుతున్నాయని ఆవేదన వ్యక్త్తం చేశారు.
వీరు చేసే తప్పిదాల వలన పల్లెల్లో సైతం కాలుష్యం పెరిగిపోతోందన్నారు. ఇక పట్టణాల్లో కాంక్రీట్ మోజులో పడి చెట్లనేవే లేకుండా బిల్డింగ్ లు కట్టుకుంటూ స్వచ్ఛమైన ప్రకృతికి దూరం అవుతున్నారన్నారు. ప్రకృతి ఉచితంగా ప్రసాధించే నీటిని సైతం కొని తాగే స్థాయికి చేరడం బాధాకరమన్నారు.
మొక్కలు విరివిగా పెంచకపోతే గాలి ని కూడా కొనే దారుణమైన దుస్తితి ఏర్పడుతుందన్నారు. ఈ స్థితి కి చేరక ముందే ప్రతి ఒక్కరూ మేలుకోవాలని ఉష కోరారు. మన వంతు భాద్యతగా అందరూ కలసి కట్టుగా మొక్కలు నాటే కార్యక్రమం తో కొత్త సంవత్సరానికి నాంది పలకాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్ నాయుడు, భాస్కర్ శెట్టి, తిరుమల రెడ్డి, యాచేంద్ర నాయుడు,యమున, సుమాంజలి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
.