శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని తొమ్మిదవ వార్డు మహిళా వలంటీర్ ఉమామహేశ్వరిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆపై మోసం చేసి ఆమె బలవన్మరణానికి కారణమైన కానిస్టేబుల్ ప్రసాద్ అరెస్టులో పోలీసుల జాప్యం చేస్తున్నారంటూ సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య విమర్శించారు.
పోలీసులు నిందితుడ్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. కానిస్టేబుల్ ప్రసాద్ అరెస్టులో టూటౌన్ పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా ఆదివారం స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఎం నాయకులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ ప్రసాద్ పై కేసు నమోదు చేసి ఇప్పటికి ఐదు రోజులు గడుస్తున్నా అరెస్టు చూపకపోవడం బాధాకరమన్నారు.
ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయడంతోపాటు వెంటనే అరెస్ట్ చేయాలని తిరుపతి ఎస్పీ ఆదేశాలు జారీ చేసినా స్థానిక పోలీసులు జాప్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
అత్యంత వివాదాస్పదుడైన ప్రసాద్ కు పోలీసులు కొమ్ముకాస్తుండటం వల్లనే ఆయన తరచూ నేరాలకు పాల్పడుతున్నాడనీ, పోలీసు పరపతితో తప్పించుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా పోలీసులు స్పందించి కానిస్టేబుల్ ప్రసాద్ తో పాటు అతని అన్నా, వదిన, అమ్మను కూడా వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్ష పడేలా చొరవ చూపాలని కోరారు.
లేకుంటే పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. పట్టణ బాధ్యుడు గంధం మణి, ఈశ్వరయ్య, అన్వర్ బాషా, కుప్పమ్మ, సునీల్, నజీరుల్లా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
.