‘‘కాటికి కాలు జాచిన వయసు నాది. పెరాలసిస్ నాకు శాపమైంది. ఇరవై ఏళ్లుగా మంచానికే పరిమతయ్యాను. కదలలేను. మెదలలేను. ఈ వ్యాధికి తోడు మా కుటుంబం కటిక పేదరికంలో మగ్గుతోంది. నా భార్య కూడా కాటికి కాలు జాచింది. ఇలాంటి పరిస్థితిలో బతుకు బండి లాగడం కష్టంగా ఉంది. పింఛను మంజూరు చేస్తే… దానితోనైనా నాలుగు మెతుకులు తింటాం.
అధికారులు కరుణించి… తమకు న్యాయం చేయాలని ఓ వృద్దుడు వేడుకుంటున్నాడు. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పొయ్య గ్రామానికి చెందిన గంధం పెంచలయ్య (65)ది చాలా నిరుపేద కుటుంబం. వీరి కుటుంబం కూలీపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. పెంచలయ్యకు పేదరికానికి తోడు పెరాలసిస్ శాపంగా మారింది.
పెరాలసిస్ కారణంగా ఈయన సుమారు 20ఏళ్లుగా మంచానికే పరిమితం అయ్యాడు. భార్య కష్టంతో బతుకు వెళ్ల దీస్తున్నాడు. పెంచలయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించే ఆర్థిక స్థోమత కూడా ఈ కుటుంబానికి లేదు. ఈయన మందులకే నెలకు రూ,6వేలకు పైగా ఖర్చు వస్తోంది. పెంచలయ్య భార్యకు వృద్ధాప్య పింఛను వస్తోంది.
కుటుంబ పోషణకు, మందులకు ఈ సొమ్ము ఏ మూలకు చాలడం లేదు. ఈ కారణంగా పెంచలయ్య కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. తనకు పెరాలసిస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించే ధృవీకరణ పత్రం ప్రభుత్వ అధికారులు ఇస్తే… దాని దాని సామాజిక భధ్రతా పింఛను పొందవచ్చని పెంచలయ్య అంటున్నారు.
గతంలో అధికారులు చుట్టూ తిరిగి తిరిగి అలసి పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన పరిస్థితిని గమనించి అధికారులు తనకు న్యాయం చేయాలని ఆయన వేడుకుంటున్నాడు. అధికారులు కనైనా స్పందించి మానవతా దృక్పథంతో పెంచలయ్యకు సాయం చేయాల్సి ఉంది.
.