స్త్రీ విద్య, సమానత్వం, అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేసిన సావిత్రీ బాయి పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు అంగేరి పుల్లయ్య పిలుపునిచ్చారు.
తొట్టంబేడు ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో సోమవారం సావిత్రి భాయి పూలే 191వ జయంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా సావిత్రీ బాయిపూలే చిత్రపటానికి ప్రిన్సిపల్ సుధాకర్ గారు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ సావిత్రీబాయి పూలే స్త్రీ విద్య, సమానత్వం, అంటరానితనం, కులవివక్షపై మొక్కవోని పోరాటం చేశారని గుర్తు చేశారు.
మహిళల చదువే సమాజానికి వెలుగని చాటిన దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని కొనియాడారు. ఆమె జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దేశంలో లో మహిళపై ప్రతిరోజు దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని వీటిని అరికట్టడంలో పాలకులు పూర్తిగా విఫలమైందన్నారు. స్త్రీకి సమాన అవకాశాలు కల్పించడం లేదని… 33 శాతం రిజర్వేషన్లు రూపు దాల్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చదువు ద్వారానే మహిళల్లో చైతన్యం వస్తుందనీ… ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు అభ్యసించి సావిత్రీ భాయి ఆశయాలకు ప్రాణం పోయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, ఐద్వా పట్టణ అధ్యక్షురాలు కుప్పమ్మ, సీఐటీయూ నాయకులు గంధం మణి, పెనగడం గురవయ్య, ప్రజానాట్యమండలి వేణు తదితరులు పాల్గొన్నారు.
.