ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి ఉద్యమాలకు మాతృసంస్థగా రాష్ట్రోపాధ్యాయసంఘం [ఎస్టీయూ] ఉంటోందని ఎస్టీయూ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మురళి అన్నారు.
గురువారం స్థానిక మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంఘ దైనందిని , కాలమానపట్టిక ఆవిష్కరణ కార్యక్రమం మండల అధ్యక్షురాలు భార్గవి, మండల విద్యాశాఖాధికారిణి శ్రీదేవి చే నిర్వహించారు.
ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడంలో ఎస్టీయూ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. అప్రెంటీస్ విధానం రద్దు, స్పెషల్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్ లు వంటి అనేక దీర్ఘకాలిక సమస్యలను సాధించడంలో ఎస్టీయూ కీలకమైన పాత్ర పోషించిందని గుర్తుచేశారు.
ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, అనవసరమైన యాప్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ 6 డీఎలు బకాయిలు పెట్టడం శోచనీయమని అన్నారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నూతన ఫించను విధానాన్ని రద్దుచేసి పాత ఫించను విధానాన్ని అమలుచేసి ఎన్నికల హామీలలో ఇచ్చిన మాట తప్పక నిలబెట్టుకోవాలని కోరారు.
పి.ఆర్.సి.పై కాలయాపన సమావేశాలు నిర్వహించకుండా వెంటనే 55% తో వెంటనే పి.ఆర్.సి.ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల భద్రత ప్రభుత్వ బాధ్యత అని ప్రభుత్వ పెద్దలు గుర్తెరగాలని సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రజలలో భాగమే కాదన్నట్లు చూడడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా యం.పి.పి. భార్గవి, యం.ఇ.ఓ. శ్రీదేవి మాట్లాడుతూ విద్యా వ్యవస్థ అభివృద్ధి కార్యక్రమాలలో మరియు ఉపాధ్యాయుల సేవలో ముందుండడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు కిషోర్ కుమార్, మహేంద్రన్ , గంగామోహన్ , గణేశన్, రాజశేఖర్ , నారాయణస్వామి, రామనాధ్ కుమార్, సుబ్రమణ్యం , రమేష్ , హేమంత్ కుమార్, నాగభూషణం,సుమతి, శ్రీదేవి, లలిత తదితరులు పాల్గొన్నారు.
.