నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని జ్యోతి (18) ని గొంతు కోసిన ప్రేమోన్మాది చెంచుకృష్ణను కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం నేతలు డిమాండు చేశారు. ప్రాణాపాయ స్థితిలో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్యోతిని సోమవారం తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష తదితరులు పరామర్శించారు.
బాధితురాలు జ్యోతికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వెంకటగిరిలో ఇంటర్మీడియట్ చదువుతున్న జ్యోతిని అదే ప్రాంతానికి చెందిన చెంచుకృష్ణ అనే యువకుడు ప్రేమ పేరుతో కొంత కాలంగా వేధిస్తున్నాడని.. అందుకు ఆ విద్యార్ధిని తిరస్కరించడంతో ఉన్మాదిగా మారి గొంతు కోశాడన్నారు.
తెలుగుదేశం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగల పూడి అనిత బాధితురాలి కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించడంతో పాటు… ప్రేమోన్మాదికి కఠినంగా శిక్ష పడే విధంగా పోరాటం చేయాలని వెంకటగిరి మాజీ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణతో మాట్లాడినట్లు వారు తెలిపారు.
జగన్ పాలనలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇటీవల కాలంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలనే వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో ఓ విదేశీ యువతిపై అత్యాచార యత్నం జరిగిందన్నారు.
ఈ ఘటన విదేశాల్లో సైతం చర్చకు వచ్చిందని వారు తెలిపారు. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో ఇటీవల ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఈ సంఘటనలే నిదర్శనమన్నారు.
పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటనలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని పాలకులు వెంటనే గద్దె దిగాలని వారు డిమాండు చేశారు.
ఈ కార్యక్రమంలో బుల్లెట్ రమణ, ఆర్ సి మునికృష్ణ, ప్రదీప్, రుద్రకోటి, మనోహరచారీ, కుమారమ్మ, శాంతమ్మ, అనిత, భారతి, హేమ, యశోద తదితరులు పాల్గొన్నారు.
.