జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం చాలా ఎక్కువగా పెరిగిందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు అన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండరు విడుదల చేయాలని డిమాండు చేస్తూ శనివారం శ్రీకాళహస్తిలో వినూత్న పద్ధతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఖాళీలు భర్తీ చేస్తామని జగన్ తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారన్నారు.
అయితే ఆయన అధికారంలోకి వచ్చి సుమారు మూడేళ్లు అవుతున్నప్పటికీ…. సచివాలయ ఉద్యోగాలు తప్ప మిగిలిన ఏ ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.35లక్షల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని రవినాయుడు డిమాండు చేశారు.
హోం శాఖలో ఖాళీగా ఉన్న 6,500 పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రతి యేటా జనవరిలో జాబ్ క్యాలెండరు విడుదల చేస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పరన్నారు. ఇంతవరకు ఒక ఏడాది కూడా జాబ్ క్యాలెండరు విడుదల చేయక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. జాబ్ క్యాలెండరుపై అసెంబ్లీలో టీడీపీ శాసనమండలి సభ్యులు నారా లోకేష్ ప్రశ్నిస్తే.. జగన్ సమాధానం చెప్పకుండా దాట వేశారన్నారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండు చేస్తూ.. నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ కు పిలుపు నిస్తే ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి వారిని అరెస్టు చేయించందని ఆయన ఆరోపించారు. నిరుద్యోగులరు ద్రోహం చేస్తున్న జగన్ కు బుద్ది చెప్పాలని ఆయన పిలుపు నిచ్చారు. వైసీపీ విధానాల వలన ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా ఏ ఒక్క పరిశ్రమ రావడం లేదన్నారు.
ఫలితంగా ప్రైవేటు రంగంలో కూడా యువతకు ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉద్యోగాలు లేక పోవడంతో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా కూలీలుగా మారాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జాబ్ క్యాలెండరు విడుదల చేయడంతో పాటు… ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండు చేశారు. లేదంటే తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్, టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయకుమార్, టీడీపీ నేతలు ప్రతాప్, ప్రకాశ్ నాయుడు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
.