తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఎస్ కే షాకీరాలీని నియమించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఈ నియామక ఉత్తర్వులు పంపారు.
షాకీరాలీ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. మొదట ఈయన శ్రీకాళహస్తి పట్టణ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా పని చేశారు. ఆ తరువాత చిత్తూరు జిల్లా మైనార్టీ విభాగం ఉపాధ్యక్షులుగా… ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
అదేవిధంగా టీడీపీ హయాంలో రెండు పర్యాయాలు వక్ఫ్ బోర్డు సభ్యులుగా పని చేశారు. ఇక శ్రీకాళహస్తి పురపాలక సంఘం కో- ఆప్షన్ సభ్యులుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన చేస్తున్న సేవలను గుర్తించి టీడీపీ అధిష్టానం రాష్ట్ర మైనార్టీ విభాగం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమించారు.
ఈ సందర్భంగా షాకీరాలీ మాట్లాడుతూ… మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, ఆయన తనయులు, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆశీసుస్సలతో తనకు ఈ పదవి దక్కిందన్నారు. పార్టీ అప్పగించిన ఈ బాధ్యతలను మనస్సాక్షిగా నిర్వర్తిస్తానని తెలిపారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తేవడమే తమ ధ్యేయమన్నారు. అదేవిధంగా మైనార్టీల అభివృద్ధికి… వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తామన్నారు. కాగా షాకీరాలీ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేయడంతో పాటు… ఆయనను అభినందించారు.
.