కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు మనందరినీ రక్షించి భక్త వత్సలుడని మరోమారు చాటి చెప్పారని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యల గురించి తమను హెచ్చరించారన్నారు.
ఆఫ్కాన్ సంస్థ ఇంజినీరింగ్ నిపుణులు, టిటిడి ఇంజినీరింగ్ అధికారులతో కలిసి శనివారం ఈవో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని, లింక్ రోడ్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు డిసెంబర్ 1న తెల్లవారుజామున రెండవ ఘాట్ రోడ్డులోని భాష్యకార్ల సన్నిధి సమీపంలో భారీ బండరాయి పడి నాలుగు వేర్వేరు ప్రాంతాల వద్ద ఘాట్ రోడ్డు తీవ్రంగా దెబ్బతిందన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు వాహనాలు ఉన్నాయని, కానీ శ్రీవారు అనుగ్రహంతో ఎవరికీ చిన్న ప్రమాదం కలగకుండా అందరినీ రక్షించినందుకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మరోమారు ధన్యవాదాలు తెలిపారు.
అప్ ఘాట్ రోడ్డు పూర్తిగా తనిఖీ చేశామని, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్లు క్షుణ్ణంగా అధ్యయనం చేశారని చెప్పారు. ఇందుకోసం అప్ ఘాట్ రోడ్డులో పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేసి తిరుమలకు అనుమతిస్తామని, అంతవరకు అప్ ఘాట్ రోడ్డులో వాహనాలను అనుమతించి లింక్ రోడ్డు ద్వారా మోకాళ్ళ మెట్టు నుండి తిరుమలకు అనుమతించడం ద్వారా భక్తులకు అసౌకర్యం తగ్గించినట్లు వివరించారు.
కేరళ రాష్ట్రం కొల్లంలోని అమృత విశ్వవిద్యాలయం నుండి వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ల్యాండ్‌స్లైడ్ డిజాస్టర్ రిడక్షన్ కింద ప్రాజెక్ట్ చేస్తున్న పరిశోధక నిపుణుల బృందం శనివారం రెండవ ఘాట్ రోడ్డును పరిశీలించనున్నట్లు చెప్పారు.
ఢిల్లీ ఐఐటి నిపుణులు, కొల్లం ల్యాండ్‌స్లైడ్స్ నిపుణుల బృందం నివేదికలు పరిశీలించి, వారి సాంకేతిక సలహాలతో తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కొండచరియలు విరిగిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగించుకొని డ్రోన్ల ద్వారా క్షుణంగా సమగ్ర సర్వే నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. అప్ ఘాట్ రోడ్డులో చేయవలసిన సివిల్ పనులు చేయడం, మట్టి బంధాన్ని మెరుగుపరచడం, పచ్చదనం పెంపొందించడం, జీయో ఇంజినీరింగ్ వాడుకోవడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా టిటిడి ఇంజినీరింగ్ అధికారులకు, సిబ్బందికి ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కునేందుకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకోసం హిమాలయాలు, కేరళ, పశ్చిమ కనుమలలోని ప్రాంతాలు, సాధారణంగా ఇటువంటి సంఘటనలు జరిగే దేశాలలో కొండచరియలు విరిగిపడకుండా నిరోధించడానికి ఉపయోగించిన సాంకేతికతపై వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
త్వరలో అధికారులతో చర్చించి పాపావినాశనం, ఆకాశగంగ మార్గాల్లో భక్తులను అనుమతిస్తామన్నారు.
అంతకుముందు సిఇ నాగేశ్వర రావు అలిపిరి నుండి లింక్ రోడ్డు వరకు అప్ ఘాట్ రోడ్డులో జరుగుతున్న పనులను ఈవోకు వివరించారు.
ఈవో వెంట జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, ఎస్ఇ – 2 జగదీశ్వర్ రెడ్డి, విజీవో బాలిరెడ్డి, ఈఈ సురేంద్రరెడ్డి, ఆఫ్కాన్ సంస్థ ఇంజినీరింగ్ నిపుణులు ఉన్నారు.
.

Discussion about this post