ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో వారం రోజులుగా జనం తాగునీటి కోసం అల్లాడి పోతున్నారు. బిందెడు నీటి కోసం పుర ప్రజలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. తాగునీరు దొరక్క జనం అల్లాడి పోతున్నా… ఇటు అధికారులు కానీ… అటు పాలకులు పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది.
శ్రీకాళహస్తికి నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే తెలుగుగంగ కాలువ వెళుతోంది. ఈ కాలువ నుంచి నీటిని సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు పంపడం… అక్కడ నుంచి సమీపంలోని ట్యాంకులకు పంపుతనున్నారు.అక్కడ నీటిని శుభ్రం చేసి పైపుల ద్వారా శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
రెండు దశాబ్దాలకు పైగా ఈ విధానం కొనసాగుతోంది. తెలుగుగంగ నీరు పుష్కలంగా ఉండటంతో శ్రీకాళహస్తి వాసులకు సాధారణంగా తాగునీటి సమస్య ఉత్పన్నం కాదు. అయితే ఇటీవల పురపాలకశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. ఫలితంగా జనం తాగునీటి కోసం అనేక కష్టాలు పడాల్సి వస్తోంది. చేతి పంపులు కూడా పని చేయక పోవడంతో సమస్య మరింత జఠిలమైంది.
శ్రీకాళహస్తిలో తాగునీటిని సరఫరా చేసే పైపులు వారం రోజుల కిందట మరమ్మతుకు గురయ్యాయి. ఆ విభాగం సిబ్బందిని వినియోగించి వెంటనే సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత పురపాలక శాఖ అధికారులపై ఉంది. ఈ సమస్య ఉత్పన్నమై వారం రోజులు అవుతున్నప్పటికీ పరిష్కారం కాలేదు.
ఫలితంగా శ్రీకాళహస్తి పట్టణంలోని కైలాసగిరికాలనీ, బహదూర్ పేట, తెట్టు, నక్కా హరిజనవాడ, హౌసింగ్ బోర్డు కాలనీ, దక్షిణ కైలాస నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా ఆగిపోయింది. వేసవి కావడంతో జనం తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు పురపాలక అధికారులు వాటర్ ట్యాంకులను కూడా పంపడం లేదని పట్టణ వాసులు వాపోతున్నారు. చేతి పంపుల్లో నీరు రాక పోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు అంటున్నారు. పుర ప్రజల తాగునీటి సమస్యను గుర్తించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం చేయాల్సి ఉంది.
.