తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం వైస్ ఎంపీపీ బబిత తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం శ్రీకాళహస్తి ఎంపీడీవో నరసింహమూర్తికి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.
ఈ రాజీనామా ఇంకా ఆమోదించలేదని సమాచారం. బబిత వైసీపీ తరపున శ్రీకాళహస్తి మండలం బీవీపురం ఎంపీటీసీ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎంపికైంది.
కలవగుంట గ్రామానికి చెందిన ఈమె కుటుంబం ఆ ప్రాంతంలో తమకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని కలిగి ఉంది. ఈ కుటుంబం చాలా కాలంగా వైసీపీలోనే ఉంది.
అయితే ఇటీవల కొంతకాలంగా బబిత భర్త శ్రీనివాసులురెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. శ్రీకాళహస్తి మండలం వైసీపీలో తమ కుటుంబానికి తగిన ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.
ఆ నేపథ్యంలోనే శ్రీనివాసులురెడ్డి తన భార్య బబిత వద్ద రాజీనామా చేయించినట్లు సమాచారం. బబిత వైస్ ఎంపీపీ పదవికి రాజీనామా చేయడం శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బబిత తన రాజీనామా ఉపసంహరించుకునే విధంగా అధికార పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
.