కొన్ని మంచి విషయాలను విన్నప్పుడు వాటిని యథాతథంగా పాటిస్తే మనం చాలా గొప్పవాళ్లం అవుతామేమో అనిపిస్తుంది. నిజమే కావొచ్చు. ఇలాంటి సుభాషితాలు ఎప్పుడూ కూడా మహనీయుల జీవిత నిదర్శనాలనుంచి తయారయ్యేవి కాబట్టి.. యథాతథంగా కాకపోయినా కొంతవరకు పాటించినా చాలు మనం ఎంతో కొంత గొప్పవారవుతాం అనిపిస్తుంది. కానీ.. ఒక సుభాషితం విన్నప్పుడు దాన్ని రివర్స్ గేర్ లో ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? ఇది మాత్రం రివర్స్ గేర్ లో పాటించినప్పుడు ఇంకా గొప్పవారిగా తీర్చిదిద్దుతుంది.
‘మనో వాక్కాయ కర్మలు’ అనే పదం తరచూ వింటుంటాం. ఇవన్నీ కలిపి చేసేది త్రికరణ శుద్ధి అంటారు. మనసులో ఏదైతే అనుకుంటామో అదే వాక్కు రూపంలో బయటకు చెప్పాలి. ఏదైతే చెప్పామో.. దానినే కర్మ రూపంలో చేయాలి.. ఇదీ సాధారణంగా త్రికరణశుద్ధి అనేదానికి ఆచరణ రూపం.
ఇలా త్రికరణ శుద్ధిగా ఉండడం ఎవరికైనా సాధ్యమేనా? అనేది పెద్ద మీమాంస. మనసులో అనుకున్నదంతా ప్రతి సందర్భంలోనూ బయటకు చెప్పగలమా? బయటకు చెప్పిన ప్రతిదీ ఆచరించగలమా? అంటే దాదాపుగా అసాధ్యం. అంతటి ఆచరణ శీలురు మనకు ఎక్కడా కనిపించరు. కానీ.. ఇదే సుభాషితాన్ని రివర్స్ గేర్ లో ఆచరించడం కూడా మనల్ని గొప్పవాళ్లుగా తయారు చేస్తుంది. రివర్స్ గేర్ ఆచరణ చాలా సులభం కూడా.
త్రికరణ శుద్ధి అనే పదం చెప్పే క్రమం.. చిత్తశుద్ధికి సంబంధించినది. అయితే రివర్స్ గేర్ అనేది మనలోని నిజాయితీకి సంబంధించినది.
ఇది చాలా సింపుల్. ఎలాగంటే.. ‘‘నువ్వు ఏదైతే పని చేశావో (చేస్తున్నావో) దానినే మాటలరూపంలో బయటకు చెప్పు. ఏదైతే చెప్పావో అదే మనసులో కూడా గుర్తుంచుకో’’ అనే రివర్స్ నిర్వచనం త్రికరణ శుద్ధికి మనం అలవాటు చేసుకోవాల్సిన ఆధునికరూపం. ఇదంతా నిజాయితీ అవుతుంది.
ఒక చైనీస్ సామెత ఇలా చెబుతుంది.. ‘‘నిజం చెప్పడంలో ఉన్న గొప్ప ఎడ్వాంటేజీ ఏంటంటే.. నువ్వు చెప్పిన సంగతిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు’’ అని! అది నిజమే. అబద్ధం చెప్పినట్లయితే.. దాన్ని మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఎవరి దగ్గర ఏ అబద్ధం చెప్పామో… రెండోసారి కలిసినప్పుడు మళ్లీ అదే అబద్ధాన్ని రిపీట్ చేయాలి. అబద్ధం మన అలవాటు అయితే గనుక… ఒక సంఘటనకు సంబంధించి నలుగురితో నాలుగు రకాల అబద్ధాలు చెప్పినప్పుడు ఎవరితో ఏం చెప్పామో గుర్తుంచుకోవడం చాలా కష్టం. చివరికి ఆ అబద్ధాలు అన్నీ కలగాపులగం అయిపోయి పరువు తీసేస్తాయి. నిజం చెబితే ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అదే సంగతి చెబుతుంటాం.
పోలీసుల విచారణలో నేరగాళ్లు దొరికిపోయేది ఇలాగే. ఒకసారి అబద్ధం చెప్తారు. విచారణ చేసే వ్యక్తులు, సంస్థలు, వారు అనుసరించే పద్ధతులు మారుతున్న కొద్దీ.. మళ్లీ మళ్లీ ఎన్నోసార్లు చెప్పాల్సి వచ్చేసరికి.. వీరు చెప్పే అబద్ధం కొద్దికొద్దిగా వగలుపోతూ రూపు మారుతూ వచ్చిందనుకోండి. అదే వారిని నేరస్తులుగా పట్టిచ్చేన్తుంది. నిజం చెబితే అందులో ఎన్నిసార్లు చెప్పినా ఎలాంటి మార్పు జరగదు. అవసరముండదు. అదే మనకు బలం అవుతుంది.
ఇవి కూడా చదవండి :
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
మన విలువను వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవడం అవసరం
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
సరిగ్గా ఇదే సూత్రాన్ని ఆధారం చేసుకునే.. ఒక సిరీస్ ఆఫ్ అబద్ధాలని, చాలా బలంగా గుర్తు పెట్టుకుని.. ఎలాంటి మార్పు లేకుండా చెప్పడం ద్వారా ఎడ్వాంటేజీ పొందడమే కథాంశంగా వచ్చిన ‘దృశ్యం’ సినిమా విజయవంతం అయింది.
అనుకున్నదే చెప్పడం.. చెప్పింది చేయడం.. చిత్తశుద్ధి!
చేసిందే చెప్పడం.. చెప్పిందే మనసులో ఉంచుకోవడం.. నిజాయితీ!
చిత్తశుద్ధి ముఖ్యమే.. కానీ నిజాయితీ ఇంకా ముఖ్యం. చిత్తశుద్ధి మన గొప్పతనం మాత్రమే. కానీ నిజాయితీ మనకు రక్షాకవచం కూడా.
యథా చిత్తం తథా వాచో, యథా వాచస్తథా క్రియాః ।
చిత్తే వాచి క్రియాయాం చ సాధూనామేకరూపతా ॥
ఏదైతే మనసులో ఉంటుందో అదే మాటల్లోకి, ఏదైతే మాటల్లో ఉంటుందో అదే చేతల్లోకి రావాలి. ఈ మూడూ ఒకేవిధంగా ఆచరించిన వారే సాధువులు అని సుభాషితం చెబుతుంది.
నిజమే. కానీ రివర్స్ గేర్ లో ఆలోచించండి. మీరు నిజాయితీగల వ్యక్తులు అవుతారు.
కొన్ని సూక్తుల్ని స్ట్రెయిట్ గా మాత్రమే కాదు.. రివర్స్ లో ఆలోచించినా మనకు మేలు జరుగుతుంది.
సాధారణ క్రమంలో త్రికరణ శుద్ధి చాలా కష్టం..
‘అనుకున్నదే చెప్పడం’ సంగతేమో గానీ.. ‘అనుకున్నదెల్లా చెప్పడం’ చాలా సందర్భాల్లో మనకు సాధ్యం కాదు. మనసులో వంద ఆలోచనలు ఉంటాయి.. అవన్నీ బయటకు చెబితే అవతలి వాళ్లు ఏమనుకుంటారో అనే సంకోచం వెన్నాడుతుంటుంది. ఆ ఆలోచనలకు ముసుగులు వేసేసి, ఫిల్టర్ లు పెట్టి.. ఏ కొంచెమో బయటకు చెప్తాం. ‘చెప్పింది చేయడం’ కొన్ని సందర్భాల్లో సులువే. కానీ, ‘చెప్పిందెల్లా చేయడం’ అసాధ్యం! ఇలా త్రికరణ శుద్ధిని అది చెప్పే క్రమంలో ఆచరించి చిత్తశుద్ధిని నిరూపించుకోవడంలో చికాకులు ఎక్కువ. అసంతృప్తులకు, అపోహలకు కూడా అది దారితీస్తుంటుంది.
రివర్స్ గేర్ లో అయితే.. ఈ ఇబ్బందులేమీ ఉండవు. చేసిందే చెప్తాం. అది ఎటూ గుర్తుంటుంది. నిజాయితీగా ఉన్నాం అనే తృప్తి కూడా మిగులుతుంది. కాబట్టి-
‘‘యథా క్రియా తథా వాచో, యథా వాచస్తథా చిత్తం’’ అని గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది.
.

Discussion about this post