వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలును అన్ని విధాల ఆదుకుంటామని నగర మేయర్ ఎస్.అముద చెప్పారు. నీవా నదిలో వరద ప్రవాహంతో సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం తరఫున మంగళవారం నిత్యావసరాలను పంపిణీ చేశారు.
నగరంలోని జైహింద్ నగరపాలక పాఠశాలల ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోని బాధితులకు 25 కేజీల బియ్యం, ఒక కిలో కందిపప్పు, ఒక లీటర్ వంటనూనె, బంగాళాదుంప, ఉల్లిపాయలు కేజీ చొప్పున అందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ… గతంలో ఎన్నడూ లేనంతగా భారీవర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అధికారులు ముందస్తు చర్యల నేపథ్యంలో ప్రాణనష్టం తప్పింది. నీవా నది వరద బాధితులకు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఎక్కడికక్కడ సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి సౌకర్యాల కల్పిస్తున్నట్లు చెప్పారు.
వర్షాల వల్ల ఏర్పడిన నష్టాలను అంచనా వేస్తున్నారని, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వివరించారు. నగరంలోని వీరభద్ర కాలనీ, తేనబండ, తోటపాళ్యం, సి కె నగర్ లో బాధితులకు నిత్యావసరాలను అందించారు.
ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ విశ్వనాథ్, తహసిల్దార్ చిట్టిబాబు, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, రెవిన్యూ, నగరపాలక అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
.