తూర్పు మండలాల రైతులకు ఎరువులు సరఫరా చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ డిమాండు చేశారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో శనివారం రైతు సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో రబీ రైతుకు ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు
అసలే తుఫానుతో నష్టపోయిన అన్నదాతకు ఇలా ఇబ్బందులు సృష్టించడం మంచిది కాదన్నారు. రబీ సీజనులో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచక పోవడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనమన్నారు.
రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉంటాయని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో అమలుచేయకపోవడం దారుణమన్నారు.
పంటలకు తెగుళ్లు సోకుతున్నప్పటికీ వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. జిల్లా అధికారులు ఇకనైనా స్పందించి రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య, రైతు సంఘం నాయకులు గంధం మణి, సీఐటీయూ శ్రీకాళహస్తి డివిజన్ కార్యదర్శి పెనగడం గురవయ్య, ప్రజా నాట్య మండలి జిల్లా సహాయ కార్యదర్శి జి.వేణు, రైతులు పాల్గొన్నారు.
.