బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తూర్పు మండలాలలైన శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురిసింది. జిల్లాలోనే అత్యధికంగా తొట్టంబేడు మండలంలో 110.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇక బుచ్చినాయుడుకండ్రిగలో 100.4 మి.మీ., శ్రీకాళహస్తిలో 99.8 మి.మీ. వంతున వర్షం కురిసింది.
భారీ వర్షంతో వంకలు, వాగులు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. శ్రీకాళహస్తి పట్టణ నడిబొడ్డున స్వర్ణముఖినది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. నదీ ప్రవాహం పెరుగుతుండటంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇక శ్రీకాళహస్తి పట్టణంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ముంపు బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాల పరిధిలో వందలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. పెద్ద మొత్తంలో పంట వర్సార్పణం కావడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు.
తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాళహస్తి తహసీల్దారు జరీనాబేగం, తొట్టంబేడు తహసీల్దారు పరమేశ్వరస్వామి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు… సహాయక చర్యల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. నీటిపారుదలశాఖ అధికారులతో కలసి ప్రమాదకరంగా ఉన్న చెరువులను పరిశీలించారు.
సహాయక చర్యల్లో ఎమ్మెల్యే కుటుంబం
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తుఫాను భీభత్సం సృష్టిస్తుండటంతో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి కుటుంబం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డితో పాటు ఆయన కుమార్తె పవిత్రారెడ్డి, కుమారుడు ఆకర్షరెడ్డి వేర్వరుగా శ్రీకాళహస్తి, రేణిగుంట, తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లో పర్యటిస్తూ బాధితులకు సాయం చేస్తున్నారు. తుఫానుతో దెబ్బతిన్న కుటుంబాలకు ప్రభుత్వం పంపిన సొమ్మును అందజేస్తున్నారు. వీరి సేవలను పలువురు కొనియాడుతున్నారు.
చిట్టత్తూరులో జేసీ పర్యటన
తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామంలో జాయింట్ కలెక్టరు రాజబాబు పర్యటించారు. తెలుగుగంగ కాలువ నుంచి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక చిట్టత్తూరు పెద్ద చెరువు ప్రమాద స్థితిలో ఉండటంతో ఆ దిగువన ఉన్న 14 గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్సకవేటరు సాయంతో చెరువు కలుజు, తూము తవ్వి నీటిని బయటకు విడుదల చేశారు.
.

Discussion about this post