• About Us
  • Contact Us
  • Our Team
Friday, September 11, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

సురేష్ పిళ్లె : ఒక కలం చావు.. వేయి కలల చావు..

తెలంగాణలో నెలన్నర రోజుల వ్యవధిలో ఇద్దరు జర్నలిస్టులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వృత్తిపరమైన ఒత్తిడులూ కారణాలుగా వ్యక్తమవుతున్నాయి. మారుతున్న పాత్రికేయ పోకడలు.. ఇలాంటి చావులను నిర్దేశించే ఒత్తిళ్లుగా ఎలా మారుతున్నాయో వివరిస్తున్న ‘ఆదర్శిని’ సంపాదకుడు సురేష్ పిళ్లె ‘బ్లాక్ & వైట్’ వ్యాసం.

admin by admin
October 5, 2021
0
సురేష్ పిళ్లె : ఒక కలం చావు.. వేయి కలల చావు..

‘పాత్రికేయ వృత్తి అంటే.. ప్రజలకు- పాలకులకు మధ్య అనుసంధానమైనది’ అని చదువుకున్నాం, అనుకుంటూ ఉంటాం. కాలక్రమంలో ఈ అనుసంధాన స్వరూపం బహుముఖాలుగా విశ్వరూపం దాలుస్తూ వస్తోంది. అనేక విధాలుగా మారుతూనే ఉంది. దిగుడుమెట్లనే పరమపద సోపానాలుగా భ్రమించి నడుస్తోంది.

ఏవి, ఎన్ని, ఎలా ఉన్నప్పటికీ.. ఈ సందర్భానికి తగినట్టుగా ‘జర్నలిస్టులు అనే వాళ్లు- వ్యథార్త హృదయుల చావులకు.. దయార్ద్ర హృదయుల కన్నీళ్లకు మధ్య అనుసంధానంగా నిలిచే వ్యక్తులు’! ‘కలం యోధులు’, ‘కలం వీరులు’.. అంటూ ఘనంగా పిలుచుకునే ఈ బిరుదులన్నీ పక్కన పెట్టండి. ‘కలం కర్మకారులు’, ‘కలం కూలీలు’ అని వ్యవహరించుకుందాం! వ్యథార్త హృదయుడైన ఏ కలం కూలీనో అర్థంతరంగా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించేస్తే.. మరే ఇతర దయార్ద్ర హృదయులో నాలుగు కన్నీటి బొట్లు కార్చేలాగా.. వారికి ఆ చావు కబురు చేరవేసేది ఎవ్వరు?

అప్పుల బాధను తాళలేని రైతులో, చదువుల ఒత్తిడిని తాళలేని చిన్నారులో, అత్తింటి ఆరళ్లను తాళలేని అభాగ్య మహిళలో అర్థంతరపు చావులను వరించి తెచ్చుకున్నప్పుడు ఆ వేదనను హృదయవిదారకంగా వర్ణించి.. చదువరుల్లో కించిత్ సానుభూతిని పుట్టించే వారెవ్వరు? అలాంటి పాత్రికేయులు కూడా ఇప్పుడు అదే ఆత్మహత్యల బాటనే ఎంచుకుంటున్నారు. వారి బలవన్మరణాలను పట్టించుకునేదెవ్వరు? శిథిలమైపోయిన వీరి కుటుంబాలలో వెతలను ప్రపంచానికి చెప్పేదెవ్వరు? అక్కడి విలాపాలను ఆలకించేదెవ్వరు? అశ్రుధారలను తుడిచి ధైర్యం చెప్పేదెవ్వరు? ఒక ‘కలం చావు’ యొక్క మూలాల్లోకి వెళ్లి.. అందుకు దారితీసిన, తీస్తున్న కారణాలను అన్వేషించి వాటిని చక్కదిద్దేదెవ్వరు? కొందరు పాత్రికేయులైనా సమాజం గురించి, ప్రతి ఒక్కరూ కూడా అందరిలాగే తమ తమ కుటుంబాల గురించి కన్నటువంటి వేల కలలు కడతేరిపోతోంటే.. ఆ  ఆర్తారావాలను చెవిన వేసుకునేదెవ్వరు?  మెదక్ జిల్లాలో  నర్సాపూర్ వార్త విలేకరి ప్రవీణ్ గౌడ్ ఆత్మహత్య.. ఇలాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది.

తెలంగాణలో నెలరోజుల వ్యవధిలో ఇది రెండో జర్నలిస్టు ఆత్మహత్య. నెలన్నర రోజుల కిందట రాజధాని నగరానికి సమీపంలోనే ఉండే తూప్రాన్ రూరల్ రిపోర్టర్ సీహెచ్ నాగరాజు ఇదే తరహాలో బలవన్మరణం చెందాడు. ఇప్పుడు ప్రవీణ్ గౌడ్ చెరువులో  దూకి కడతేరిపోయాడు. కేవలం చావులతోనే ఆగిఉంటే ఇంత చర్చ ఉండేది కాదు. కానీ ప్రవీణ్ రాసిన సూసైడ్ నోట్, అందులో తనను చావుకు ప్రేరేపించిన కారణాల్లో ఆధునిక తరం జర్నలిజం ఒత్తిళ్ల ప్రస్తావన కూడా ఉండడం వల్లనే ఇదంతా. ఈ చర్చ జర్నలిస్టులకు ఆత్మ పరిశీలన లాంటిది.

ప్రవీణ్ గౌడ్ తన సూసైడ్ నోట్ లో స్టాఫర్ పెడుతున్న ఒత్తిళ్ల గురించి రాశాడు. జర్నలిజం విలువలు అడుక్కునే స్థాయికి దిగజార్చాయని రాశాడు. సూసైడ్ నోట్ ప్రకారం.. సర్కులేషన్ టార్గెట్ విషయంలో స్టాఫ్ రిపోర్టర్ పెట్టిన మెసేజీ అతడిని మనస్తాపానికి గురిచేసింది. చావును ఆశ్రయించాడు. జర్నలిజంలో దిగజారిపోయిన విలువలు తనకు అలవాటు కాలేదని, ఆర్థిక ఇబ్బందులు భరించలేకపోతున్నానని కూడా రాశాడు. మొత్తానికి ఒక జర్నలిస్టును ఇతర కారణాలతో పాటు.. జర్నలిజం వృత్తే ఒక శాపంగా మారి అర్థంతరంగా కబళించేసింది.

ఇప్పుడిక.. ప్రవీణ్ గౌడ్ చావు డప్పు చప్పుడు చెప్పే పాఠాలేమిటో ఆలోచిద్దాం. ఏ పరిస్థితులు అతడిని చావడానికి చెరువు వైపు నడిపించాయో.. ఒకసారి చూద్దాం.

దిగజారుడు ఎప్పుడో మొదలైంది…

సుమారు దశాబ్దం కిందటి సంగతి.  ఒక వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలకు అధిపతి అయిన ఒక పెద్దాయన హఠాత్తుగా మీడియా రంగ ప్రవేశం చేశాడు. ‘మీడియా ద్వారా ప్రజలకు ఏదైనా చేయగలం’ అనే ఆలోచనతో ఈ రంగంలోకి ఎవరైనా వచ్చే రోజులు ఎప్పుడో అంతరించిపోయాయి. కనీసం మీడియాను వ్యాపారంగా భావించి లాభాలు కళ్లజూడాలని వచ్చే నిన్నటితరం ఆలోచనలు కూడా ఇతనికి లేవు. మీడియా తన ఇతర వ్యాపారాలకు కవచంగా ఉపయోగపడుతుందనే కోరిక కూడా ఆయనకు తక్కువే. ఇవేమీ లేకుండా ఎందుకు ఒకేసారి రకరకాల చానెల్స్, పత్రికలతో మీడియా రంగ ప్రవేశం చేసినట్టు? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది.

ఇవి కూడా చదవండి :

మిత్రులకు ‘శుభోదయం’ సందేశాలు పంపడానికి సుభాషితాలు ఎంచుకోండి..
సినిమా ఇండస్ట్రీలో అరాచక విశృంఖలపోకడలపై సీనియర్ జర్నలిస్ట్ ‘రామ్’బాణం
వేదనలో సమంత.. లొకేషన్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న వైనం
movie review : కంటతడి పెట్టించే సినిమా ‘రిపబ్లిక్’
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం :   జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు

మనుషులకు చావు దగ్గరయ్యే క్షణాలను, శరీరంలోని కణాలను కూడా లక్షలుగా మార్చగల ఆధునిక పసరువేది విద్యను లక్షణంగా ఎరిగిన వ్యాపారి ఆయన. తనతో సరితూగడని భావించే మరొక, వ్యక్తుల సుఖాసక్తతను తన సంపదగా మార్చుకోవడం ఎరిగిన వ్యాపారికి- మీడియా సంస్థ ఉండడం వలన దక్కుతున్న గౌరవం చూసి ఆయన అసూయ చెందాడు. ‘వాడు నాతో సరితూగడు. నాకు ఇన్ని కోట్ల రూపాయలున్నాయి. ఆ మాత్రం గౌరవాన్ని నేనూ కొనుక్కోలేనా?’ అనే భావనతో చానళ్లను ప్రారంభించేశాడు. తర్వాత, ఆ ఛానళ్లు ఎలా కొడిగట్టిపోయాయనేది వేరే విషయం. కాకపోతే.. తొలిరోజుల్లో ఉద్యోగ నియామకాల కసరత్తు జరుగుతున్న సమయం నాటి ఒక సంఘటనను తప్పక చెప్పుకోవాలి.

రాష్ట్రస్థాయి కీలక పదవులకు కొందరిని ఆయన నియమించుకున్నాడు. వారితో మీటింగులో.. జిల్లా రిపోర్టర్లు, ఆ కింది రిపోర్టర్ల నియామకం చర్చకు వచ్చింది. ‘‘ఒక్కొక్కరూ మనకు నెలకు ఎంతిస్తారు?’’ అనే మాటతో ఆ వ్యాపారి చర్చను ప్రారంభించారు. నివ్వెరపోవడం సిబ్బందిలోని పెద్దల వంతయింది. ‘అదేంటి సార్’ అంటే.. ‘రిపోర్టరుగా కార్డు యిస్తే నెలకింత చొప్పున మనకు ఇస్తారట కదా. ఎవరు బాగా ఇచ్చేట్లయితే అలాంటివాళ్లనే రిక్రూట్ చేయండి’ అంటూ ఆయన ముక్తాయించారు. ఇది కామెడీ కాదు. నిజం!

ఆయన ఆ వాతావరణాన్ని మొదలుపెట్టలేదు. అలాంటి వాతావరణం మీడియాలో ప్రబలంగా ఉన్నదనే ఎరికతో, ఆ దారిలో వ్యాపారం లాభాల బాట పడుతుందనే నమ్మకంతో ప్రవేశించిన వాడు మాత్రమే. ఆయనను నిందించాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. ఆయన తాను సంకల్పించిన ప్రమాణాల మేరకే ఛానళ్లను కనిష్ఠ జనాదరణతో, తగుమోతాదు లాభార్జనలతో ఇప్పటికీ నడిపిస్తున్నారు.

ఇది ఎప్పుడు మొదలైందంటే ఏం చెబుతాం?

ఇవాళ ప్రవీణ్ గౌడ్, స్టాఫర్ వేధింపులు తాళలేకపోతున్నానని అన్నాడంటే.. స్టాఫర్ ఏమైనా రాక్షసుడా? తన కింద లెవెల్లో ఉండే రిపోర్టర్ల రక్తమాంసాలను తాగడం పనిగా పెట్టుకున్నాడా? అలా అని నిర్ధరించలేం. అతడికెన్ని ఒత్తిళ్లు ఉన్నాయో.. అత్యంత పైనున్న వారి ధనాశను, ఆ తర్వాత రకరకాల దశల్లో స్థాయుల్లో ఉండే జర్నలిస్టు పెద్దల ఒత్తిళ్లను తన కింది వారి వరకు చేరవేయడానికి తను కేవలం ఒక వాహకంగా.. అదే తరహా ఒత్తిడి మధ్య నలుగుతున్న వాడే ఏమో? ఒక్కడినే నిందిస్తే ఎలా సరిపోతుంది? ప్రవీణ్ గౌడ్ సూసైడ్ నోట్ ఆధారంగా ఆ బలవన్మరణంపై పోలీసులు కేసు నమోదు చేయాల్సి వస్తే గనుక.. స్టాఫర్ కాదు.. అతడు పెట్టిన ఒత్తిడిని అతడి ద్వారా బట్వాడా చేయడానికి ప్రయత్నించిన పై ఉద్యోగుల్ని, యాజమాన్యాల్ని కూడా కేసులో చేర్చాలి.

మీడియాలో కాసులు రాల్చే కళ తక్కువే అని కొన్ని యాజమాన్యాలు అనతికాలంలోనే గ్రహించాయి. ‘నెలవారీ వేతనాలకి, బత్తేలకి, ఖర్చులకి, లాభాలకి కలిపి ఇంత మొత్తం మీరు సంపాదించగలిగితే చానల్ నడుపుతాం. లేకపోతే.. పోయినసొమ్ము మనది కాదనుకుని చానెల్ మూసేస్తాం..’ అనే హెచ్చరికలు జారీచేస్తూ వచ్చాయి. ఆ డీల్‌కు ఒప్పుకున్న  వారిని మాత్రమే సీఈవోల కుర్చీల్లో కూర్చోబెట్టే దుర్మార్గాలు, అరాచకాలు మొదలయ్యాయి. అలాంటి నేపథ్యంలో.. వృత్తి- ఒత్తిడిలా కాకుండా పూలపాన్పులా ఉంటుందా? ఎలా సాధ్యం?

వ్యాపారాలకు రక్షణ కవచంగా ఉండడం, రాజకీయ ప్రయోజనాలు రాబట్టడం మాత్రమే కాకుండా భూకబ్జాలకు, దందాలకు దన్నుగా ఉండగలదనే నమ్మకంతో మీడియా సంస్థలు పుట్టడం మొదలయ్యాక విలువలను ఏ కాగడా పెట్టి వెతకగలరు? ఇలాంటి యజమానులకు తగ్గట్టుగానే కూలిగణాలు కూడా తయారవుతున్నాయి. ‘ప్రెస్’ కార్డు ఇస్తే చాలు మీ బూట్లు తుడుస్తూ బతికేస్తాం అని సిద్ధపడుతున్న వారు కొల్లలుగా ఉన్నారు. ఎంచక్కా కొలువులు చేసుకుంటూ ఉన్నారు. ఈ స్రవంతిలో ఇమడని వారు లేరని కాదు. వారు కూడా పుష్కలంగా ఉన్నారు. కానీ.. జర్నలిజంతో పాటు వ్యాపారం కూడా చేయగలం అనగల వారికే యజమాని మన్నన దక్కుతోంది.

‘వ్యాపారం- రాబడి’ ఏ యాజమాన్యమైనా కోరుకునే ప్రాథమిక అంశం. వ్యాపారం- లాభం లేకుండా నడిపించడానికి మీడియా ధర్మసత్రం, చలివేంద్రం ఎంతమాత్రమూ కాదు! అయితే.. వ్యాపారం  ఒక్కటే పరమావధిగా భావించేవారు రావడం,  అందుకు ఏ విలువలను తాకట్టు పెట్టినా, తమ తమ మీడియా సంస్థలను ఎలా తార్చినా ఖాతరు లేదనుకునే వారు తయారుకావడం హేయం.

అప్పట్లో గొప్ప ఏర్పాటు ఉండేది..

అడ్వర్టైజ్మెంట్, సర్కులేషన్ విభాగాలకు చెందిన వారు ఎడిటోరియల్ సిబ్బందితో మాట్లాడడమే నేరంగా, వారి దగ్గరకు వచ్చి ఎలాంటి వార్తకు సంబంధించి అయినా చిన్నపాటి సిఫారసు చేయడం అనేది శిక్షార్హంగా నియమాలు చెలామణీ అయిన రోజులను నేను చూశాను. ఒక యాడ్‌కు సిఫారసు చేయమని సిబ్బంది ఫీల్డ్‌లో ఉండే రిపోర్టర్‌ని బతిమాలితే..  ఆ సిబ్బందిని కొరత వేయడం ఒక్కటే తక్కువ- ముక్క చీవాట్లు పెట్టిన రోజులను కూడా ఎరుగుదును. ‘యాడ్ ఆబ్లిగేషన్ సర్’ అని ఏదైనా వార్త పట్టుకుని వస్తే.. ‘పబ్లిష్ చేసే ప్రసక్తే లేదు.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో’ అనే పొగరు జీవించిఉన్న రోజులను అనుభవించాను.

ఇవి కూడా చదవండి :

అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
అవినీతి కేసుల్లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి .. తర్వాత ఎపీ సీఎస్ అవుతారా?

కాలక్రమంలో రోజులు మారాయి. రిపోర్టర్లే యాడ్స్ తేవాలనే ఏర్పాటు వచ్చింది. అందులో వారికి వాటాలు ఏర్పడ్డాయి. ఆ వాటాలు చాలా చిన్నవే- యాడ్ ఏజెన్సీలకు ఇచ్చే మొత్తాలతో పోల్చుకుంటే! కానీ జీతం రాళ్ల మీద బతుకు వెళ్లదీసే రిపోర్టర్లకు అవి చాలా ఎక్కువ. ఎగబడి చేయడం మొదలైంది. acceptable downfall గా అది మీడియాలో సాధారణ సంప్రదాయం అయింది. అలా వాటాలు ఇచ్చేవే.. ఈ పరిణామక్రమంలో.. రిపోర్టర్ల బాగు కోరే సంస్థలుగా  ముద్ర తెచ్చుకున్నాయి. కొన్ని సంస్థలు రిపోర్టర్లతో అప్రకటిత, అనధికార పైరవీలు మాత్రం చేయించుకుంటూ వాటా ఇవ్వడాన్ని ఒక నిషేధాంశంగా, దిగజారుడుతనంగా చూశాయి. ఇది వంచన! కొన్ని సంస్థలు- ‘సొమ్ములు మీరు తెస్తేనే మీకు జీతాలు.. యాడ్స్ రూపంలోనా? వసూళ్లరూపంలోనా? మీ ఇష్టం…’ అనే కాడికి వచ్చాయి. అది ప్రస్తుతానికి- పతనంలో పరాకాష్ట.

సర్కులేషన్ అనేది ఇంకో గుదిబండ అయింది. ఆ బండని రిపోర్టర్లకే మెడకే తగిలించే ప్రయత్నాలు రివాజు అయ్యాయి. వార్తలు రాయడం మానేసి, మరచిపోయి వార్షిక చందాలు కట్టిస్తూ తిరిగే వారూ ఉంటున్నారు. కొన్ని పత్రికలకు చెల్లుతుంది. కొన్ని పత్రికల పేర్లే ప్రజలు మర్చిపోయిన తర్వాత.. వాటికి చందాలు కట్టించడం ఎవరికి సాధ్యం? బ్రహ్మరుద్రాదులకైనా అయ్యేపనేనా?

ఈ రెండు రకాల, అడ్వర్‌టైజ్మెంట్, సర్కులేషన్ పనులు అనివార్యంగా జర్నలిజంలోకి చొచ్చుకు వచ్చాయి. ఈ రెండు రకాల ఆబ్లిగేషన్‌లలో ఏదో ఒకటి లేనిది వార్తే కాదన్న ధోరణులు కూడా వచ్చాయి. ఈ పోకడలు జర్నలిజం ప్రమాణాలను దిగజార్చేయడం ఎన్నడో మొదలైంది. అందరూ దానికి అలవాటు పడుతున్న తరుణంలో.. ఈ పోకడల, పర్యవసానాల అంతిమ ఫలితంగా.. ఇప్పుడు జర్నలిస్టుల ప్రాణాలనే ఆత్మహననాలుగా కబళించేయడం జరుగుతోంది.

ప్రతి జర్నలిస్టూ పరిశుద్ధాత్మ స్వరూపుడని, యాజమాన్యాలు మాత్రమే దుష్టసమూహాలని నికరంగా తేల్చి చెప్పడం నా ఉద్దేశం కాదు. ఉన్న పరిస్థితికి అది నిదర్శనం కూడా కాదు. పతనానికి అలవాటు పడిన తర్వాత కూడా, రోజు రోజుకూ పెరుగుతున్న ఒత్తిళ్లు ఎవరిని ఎక్కడకు తీసుకువెళుతున్నాయో అర్థం కావడం లేదు.

సోషల్ మీడియా ప్రధాన మీడియా స్రవంతికి పెనుముప్పుగా మారుతున్న సంధియుగంలో.. ప్రధాన స్రవంతిని పట్టించుకునే శాతం తగ్గుతోంది. తదనుగుణంగానే వ్యాపార వ్యవహారాలు కూడా. కాలంతో పాటు మారకుండా.. లాభాల్లో తరుగుదలకు సిద్ధపడి ఉండకుండా.. జర్నలిస్టుల మీద ఒత్తిడి పెంచుతూ పోవడం శ్రేయస్కరం కాదు.

ఉదాహరణ చూస్తే.. ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడికి అగ్రపత్రికలో చిన్న వార్త రావడం కంటె కూడా.. స్థానికంగా అన్ని వాట్సప్ గ్రూపుల్లో ఆ వార్త చెలామణీ కావడం ద్వారానే ఎక్కువ మైలేజీ వస్తుందనుకుంటున్నారు. రాష్ట్రస్థాయి మైలేజీ కోరుకునే స్థాయి నాయకుడు.. ఎవరికీ ఏ సొమ్ములూ చెల్లించకపోయినా అతని వార్తలను ప్రచురిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి వారినుంచి స్థానిక రిపోర్టర్లు ఎంతకాలం, ఎంతదూరం సొమ్ములు పిండి.. యాజమాన్యాల బొక్కసాలు నింపడం సాధ్యమవుతుంది.

బతుకుతెరువే ప్రధానం అనుకుంటే గనుక.. ఇంత పనీ చేయడం కంటె.. అలాంటి నాయకుల నుంచి తృణమో పణమో పుచ్చుకుని వారి తరఫున సోషల్ మీడియా అకౌంట్లలో వారి కీర్తనలు రాసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. కానీ ఆ పనికి మొగ్గుతున్న వారు తక్కువే. సగటు ఆలోచనలు, సగటు భావజాలంలో మునిగిన జర్నలిస్టుకి.. ‘ప్రెస్’ అని ఎర్రటిపట్టీపై తెల్లటి అక్షరాలున్న ఒక కార్డు కావాలి. దాని ద్వారా.. ‘గౌరవం, విలువ’ అని ఏదైతే అతను భ్రమిస్తుంటాడో అలాంటి పదార్థం వారికి కావాలి. అలాంటి గుర్తింపుకు వచ్చే నమస్కారాలు కావాలి. మర్యాదలు కావాలి. ముందస్తు అపాయింట్మెంట్ లేకపోయినా.. గన్‌మెన్ భుజం తట్టేసి, ఎమ్మెల్యే గదిలోకి వెళ్లే చొరవ కావాలి. ఇలాంటి భ్రమాత్మకమైన, మిథ్యాగౌరవాల ద్వారా వాళ్లు వ్యక్తిగతంగా లాభపడుతున్నారా లేదా వేరే సంగతి. కానీ అది వారి బలహీనత!!

ఆ బలహీనతనే ఆసరాగా చేసుకుని మీడియా సంస్థ అనే ముసుగు కింద దందాలు చేసే వ్యాపారులు ఆడుకుంటున్నారు. జర్నలిస్టులను పిండుతున్నారు. ఒక దశలో దానికి ఇష్టంగా మొగ్గుతున్న జర్నలిస్టులే.. కాలక్రమంలో తమ వల్ల కాక ఒత్తిడికి గురవుతున్నారు. ఒక నాగరాజు, ఒక ప్రవీణ్ ల చావులు మాత్రమే ఇవాళ మన కళ్లకు కనిపిస్తుండవచ్చు. కానీ చావును ఆశ్రయించే ధైర్యమూ లేని మరణ తిరస్కృతులు ఎందరున్నారో?

ఏది హేతువు? ఏది తెరువు?

సంకుచిత లక్ష్యాలతో మీడియా సంస్థలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకురావడమే ఇలాంటి పెడపోకడలకు మూలం. మీడియా గురించిన ప్రాథమిక జ్ఞానం లేకపోయినా.. డబ్బులుంటే చాలు, ఈ వ్యాపారం చేయవచ్చునని కొందరు అనుకుంటున్నారు. అదే తరహాలో, కనీస అక్షరజ్ఞానం లేకపోయినా.. రాయడం రాకపోయినా జర్నలిస్టుగా చెలామణీ అయిపోవచ్చునని, దందాలకు ఇది దన్నుగా ఉంటుందని ఇందులోకి ప్రవేశిస్తున్న వారూ పెరిగిపోతున్నారు. కనీస విద్యార్హతలు, కనీస వేతనాల అవసరం చాలా ఉంది. ఇవి ఒక చట్టం రూపంలో రక్షణ కల్పిస్తే, కొన్ని అరాచకత్వాలకు అడ్డుగోడ కట్టడం సాధ్యమవుతుంది.

కొన్ని రకాల వ్యాపారాల్లో నిర్దిష్టమైన అర్హతలను నిరూపించుకుంటే తప్ప,  ఆ వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి కూడా అవకాశమివ్వని నిబంధనలుంటాయి. ఓ కోటి రూపాయల విలువైన కాంట్రాక్టు పనిచేసేవాడు.. ఆ పని చేయడంలో తనకున్న అనుభవం ఏమిటో, తన పరిణతి ఏమిటో నిరూపించుకుంటే తప్ప.. టెండరు వేసే అర్హత కూడా ఉండదు. కానీ కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసే, యావత్ సమాజపు భవిష్యత్తును నిర్దేశించగల మీడియా సంస్థలను ప్రారంభించడానికి.. పుష్కలంగా డబ్బు ఉండడం తప్ప, ఎవ్వరికీ ఏ అర్హతా ఉండవలసిన అగత్యం లేకపోవడం.. ఈ దేశంలో ఖర్మం.

మీడియాకు కూడా అలాంటి నియమ నిబంధనలు ఉండాలి. ధనమదంతో, వక్ర లక్ష్యాలతో అడ్డగోలుగా ఇందులోకి దూరి.. దీనిని కకావికలం చేసేసి, సర్వభ్రష్టత్వానికి బాటలు తీర్చే ధూర్తుల నుంచి రక్షణ ఉండాలి.  అర్హతలను, అనుభవాన్ని నిర్దేశించాలి. ఆ నిబంధనలు సర్వ రోగనివారిణి కాజాలవు. అలాంటి నిబంధనలున్నప్పటికీ.. వ్యాపారులు మారరు గానీ.. కొంతలో కొంత అర్హతలున్నవారు వాటాదారులు అవుతారు. అంతటితో అమాంతంగా శుద్ధీకరణ జరిగిపోదు. కొంతలో కొంత మార్పు వస్తుంది. ఇవన్నీ జరుగుతాయో లేదో గానీ.. మనం ఆశించగలిగింది ఒక్కటే.

ఒకప్పటి రోజుల్లో లాగా.. ఇప్పుడు వ్యాపారాన్ని వేరుచేసి చూడలేం! అలాగని తుల్యమైన నీటి ప్రవాహాన్ని చేజేతులా దుర్గంధభూయిష్టమైన బురదగా మార్చనూలేం. యాడ్స్, సర్కులేషన్‌కు జర్నలిస్టుల సహకారం కోరాలే తప్ప.. వారి నెత్తిన ఆ భారం పెట్టి పరుగెత్తమని సంస్థలు అనకూడదు. విధిలో అనివార్యమైన భాగంగా చేయకూడదు. ఉద్యోగులుగా ఉండే జర్నలిస్టుల్లో తప్ప.. క్షేత్రస్థాయిలోని వారికి జర్నలిజం హోదా అనేది ప్రధాన జీవనోపాధి కాదు. ఆ విషయం వారికి కూడా స్పష్టంగా తెలుసు. అలాంటప్పుడు.. వారు నిత్యం అప్రమత్తంగా ఉండాలి.

ప్రత్యామ్నాయాలు లేకపోతే- ఒకవైపు తమ వృత్తి ప్రమాణాలు మెరుగుపరచుకుంటూ ఉద్యోగం స్థాయికి ఎదగడం ఒక పద్ధతి. (అందులో కూడా భద్రత అంతంతమాత్రమే కానీ, అది వేరే చర్చ!) ప్రత్యామ్నాయం ఉన్నవారు- ఈ వృత్తిలో కిట్టని పనులు చేయాల్సి వస్తున్నదని అర్థమైనప్పుడు, రాజీపడాల్సి వస్తున్నదని అనిపించగానే.. దీనిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. పైన చెప్పుకున్న మిథ్యాగౌరవాల భ్రమలో, ఈ వృత్తి- పులిమీద సవారీలాగా మారేదాకా ఆగారంటే.. ఆ పులి ఖచ్చితంగా వారిని కబళించేస్తుంది. నాగరాజు, ప్రవీణ్ ల పరిస్థితే అవుతుంది.

రైతుల ఆత్మహత్యలలాగా జర్నలిస్టుల ఆత్మహత్యలు మనకు ‘అలవాటు’ అయిపోకుండా.. ఆ వార్తల పట్ల మన శరీరం మొద్దుబారిపోకుండా ఉంటే చాలు. ఆ మరణాలను సానుభూతితో చూసే మార్దవం మనలో మిగిలి ఉంటే చాలు. పైన చెప్పుకున్న పెడపోకడలు మరింత శృతిమించకుండా జర్నలిస్టులపై వ్యాపార ఒత్తిళ్లు తగ్గితే అదే పదివేలు. ఆత్మహత్యలు ఆగితే అది పాత్రికేయ సమాజానికి అతి పెద్ద మేలు.

ఒక కలం చావు..
వేయి కలల చావులకు దారితీస్తుంది.
సమాజానికి భవిష్యత్తుపై ఉండే వేనవేల ఆశల చావులను కూడా నిర్దేశిస్తుంది.

.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
kamspillai@gmail.com

ప్రవీణ్ గౌడ్ రాసిన సూసైడ్ నోట్ చూడండి :

 

Tags: adarsini editorialdownfall of journalismeditorialjournalist suicidenagarajupraveen goud suicidereporter suicidesuresh pillaisureshpillaitrends in journalismvalues in journalism
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply