సాధారణ ఎన్నికల సమయంలో దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన జగన్… అధికారంలోకి వచ్చాక ఎందుకు చేయడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గురువారం మద్యపాన నిషేధం చేయాలని డిమాండు చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు.
మద్యం ప్రియులను సన్మానం చేయడంతో పాటు… మధ్యం సీసాలు పగుల కొట్టారు. తిరుపతి పార్లమెంటరీ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష, శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయకుమార్, పురపాలక సంఘం మాజీ వైస్ ఛైర్మన్ మిన్నల రవి, రేణుకాదేవి, సుమతి, సుబ్బయ్య, బుజ్జి, సాగర్, సుజిత్ తదితరులు ఆ నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చక్రాల ఉష మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తి పడి కల్తీమద్యం తో మహిళల తాళి బొట్లు తెoపుతోందన్నారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆమె విమర్శించారు. జగన్ ఎన్నికలకు ముందు మధ్యపాన నిషేధం చేస్తానని మహిళలను నమ్మించి గద్దెనెక్కి… ఇప్పుడు ఆ మహిళల తాళిబొట్లు తెoపుతున్నాడన్నారు.
భారతదేశం లో ఎక్కడా లేని కల్తీ బ్రాoడ్లను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను ఆర్ధికంగాను, ఆరోగ్యపరంగానూ జలగలా పీల్చిపిప్పి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కమీషన్లకు కక్కుర్తి పడి వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఆఫ్రికాలో మద్యo వ్యాపారం చేస్తూ… అక్కడ ఉత్పత్తి చేసే బ్రాండ్లనే మన రాష్ట్రం లో అమ్మి ప్రజల ప్రాణాలను బలి చేస్తూ ధన ధనదాహం తీర్చుకుంటున్నారని ఉష ఆరోపించారు.
కల్తీ మద్యం వలన ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని… మరికొందరు అనారోగ్యపాలవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు అయితే మతిస్థిమితం కోల్పోతున్నారని ఆమె చెప్పారు. ఆంధ్రా గోల్డ్, ఆంధ్రా ఛాయిస్, రోల్ మోడల్, టాప్ స్టార్, ప్రెసిడెంట్, టీచర్స్, లాయర్స్ ఇలా సిగ్గులేకుండా విలువైన పదాలను కూడా భ్రష్టు పట్టిస్తున్నారన్నారు.
గతంలో రూ.100లు ఉన్న బాటిల్ ధర ప్రస్తుతం రూ.200లు చేసారని… ఇపుడు మళ్ళీ రూ.20 నుంచి రూ.30లు తగ్గించి… ధరలు తగ్గించానని తుగ్లక్ చర్యలు చేయడం సబబు కాదన్నారు. ఈకల్తీ మధ్యాన్ని వెంటనే రద్దుచేయాలని లేకుంటే తెలుగు మహిళలే మద్యంషాపులను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటికన్నా ఆడపడచుల ఆవేదన అర్థం చేసుకొని మద్యపాన నిషేధం చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున ఆమె డిమాండ్ చేశారు.
.