చిన్నప్పుడు ఎన్నోసార్లు దండెత్తినా నన్ను వశపరుచు కోలేక పోయింది కాఫీ..
నలభై ఏళ్లవరకు అలవాటు లేని కాఫీ ఎప్పుడు అంటుకుందో తెలియదుకానీ ఇంక వదలదనే విషయం మాత్రం అర్థం అయ్యింది. ఉదయం లేచిన వెంటనే పేపర్ కోసం వెతుక్కునే వాడిని, పాల పేకెట్టుల కోసం ఎదురుచూడటం మొదలెట్టాను. ఆలస్యమైందంటే పిల్లికి కాలు కాలినట్లే. కౌశికుని శాపాలకి మా పాలబ్బాయి కొంగ ఐపోవాల్సిందే..
కాఫీ డే లో అనుకుంటా.. మొదటిసారి కోల్డ్ కాఫీ తాగి లొంగిపోయినట్లు గుర్తు. అటువంటి రుచి కాఫీకి తేవాలనే దురద, అది అంతసులభం కాదని తెలిసి, ఒక ధ్యేయంగా మారి, రకరకాల ప్రయోగాలపాలు చేసింది.
అసలు కాఫీలు ఎన్ని?
అరేబికా, రోబస్టా.. అందులో కాయకి ఒక్క గింజే ఉండేవి.. రెండు గింజలు ఉండేవి ..
కాఫీ పొడులు ఎన్ని రకాలు ?
బోల్డన్ని.. చికొరి కలపనివి, కలిపినవి. ఎక్కువగా వేయించ బడినవి, ఎత్తైన ప్రదేశాల్లో పెరిగిన కాఫీ గింజల నుంచి తయారు చేసినవి, మెత్తగా ఆడబడినవి, నూక లాగా గరుకైనవి.. వగైరా వగైరా..
కాఫీ కాచే విధంబు ఎట్టిది ?
ఫిల్టర్ , మోక పాటు (మోకాలి పోటు కాదు), ఎస్ప్రెస్సో, పౌర్ ఓవర్ (చిన్నప్పుడు గుడ్డమీద పోసి వడపోసే విధానమే).. ఇంకా బోల్డన్ని..
తయారైన కాఫీలు ఎన్ని రకాలు ?
కాఫీ లాటే, క్యాపుచ్చినో, బ్లాక్ కాఫీ, అమెరికానో, మోచ లాటే, ఐరిష్ కాఫీ, కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ.. ఇంకా చచ్చినన్ని. అసలు గ్లాసులో పాలు ముందు పోసి తర్వాత్ డికాక్షన్ పోస్తే ఒకటి.. ముందు డికాక్షన్ పోస్తే ఇంకొకటి!
ఎలాగైనా మంచి కాఫీ తయారు చేయాలన్న తపన జ్ఞానాన్ని, పెరిగిన జ్ఞానం అసహనాన్ని ఇచ్చాయే తప్ప మంచి కాఫీ మాత్రం చాలా కాలం అందని ద్రాక్ష లాగే ఉండి పోయింది.
అయితే ప్రయోగాలు ఫలించి నేను కలలు కన్న కాఫీ ఒక రోజు కటాక్షించింది.. రోజూ బిందుకి కూడా నేనే కాఫీ పెట్టడం.. వేడి వేడి కాఫీ పొగల మధ్య నుంచి చిలిపిగా నవ్వే కళ్ళని చూస్తూ మురవడం.. అలా సుఖంగా సాగిపోతున్న తరుణంలో facebook లో పోస్టబడింది ..ఇన్‌బాక్స్‌లో ఎంక్వైరీలు, కామెంట్స్‌లో ప్రశంసలు..
అదే ఊపులో నా కాఫీ జ్ఞానాన్ని మిత్రులందరికీ పంచడం మొదలెట్టా .. ఈ సందర్భంగా నన్ను బాగా కదిలించిన రెండు సంఘటనలు చెప్పాలి. ఒక రోజు ఇంటికొచ్చిన మిత్రుడు నా కాఫీ కళని మెచ్చుకుంటూ మా ఆవిడతో
“మీకు కూడా కాఫీ ఈయనే పెట్టి ఇస్తాడట కదా.. చెబుతుంటే మేమూ పొద్దుటే మీ ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది.. మనోడి (అంటే నేనే) పేషన్ని ఒప్పుకోవచ్చు’’
“కాఫీ బాగానే పెడతాడు కానీ.. ఎప్పుడెలా ఉంటుందో తెలియదు.. మనిషిలాగే దానికీ స్థిరం లేదు’’
అనేసింది. ఎక్కడో ఏదో కలుక్కుమంది.. అయినా మంచి కాఫీ పెడదామనుకుంటాం కానీ కుదరటం, కుదరకపోవడం దైవాధీనం అనే విషయం వీళ్ళకి ఎలా తెలుస్తుంది?
రెండవ సంఘటన ఇంకా విచిత్రమైనది. రాక రాక ఇంటికి వచ్చిన అమ్మకీ , నాన్నకీ మాంచి కాఫీ కలిపి ఇచ్చా.
“ఎలా ఉంది?” ఆతృతగా అడిగాను.
“నువ్వొకసారి హవానా సిగార్స్ అని బెంగుళూరు నుంచి తెచ్చావు గుర్తుందా?”
“అవును ఒక్కోటి వంద రూపాయలు..’’
“మన లంక పుగాకు కాల్చిన నోటికి చప్పగా చచ్చాయి.. సరదా పడుతుంటే ఎవరికో ఇచ్చేసా..”
“దానికీ కాఫీ కీ సంబంధం ఏమిటి?”
“ఇదీ అలాగే ఉంది.. చిక్కని కాఫీ తాగే నోటికి ఈ ప్యూర్ కాఫీ.. అబ్బే..’’
అయినా మంచి కాఫీని కంటాం కానీ ఎదుటివారికి నచ్చడం, నచ్చక పోవడం మన చేతిలో ఉంటుందా? అందరికీ మాంచి కాఫీ తాగే అదృష్టం ఉండొద్దూ..
ఏతావాతా తెలిసింది ఏమిటంటే ఈ పాడు ప్రపంచంలో మనుషుల్లాగే కాఫీకి కూడా మంచి, చెడూ ఉండదు.. ఎవరి కాఫీ వాళ్ళది..
(ప్రపంచ కాఫీ దినోత్సవం సందర్భంగా.. కాఫీ ముచ్చట్లు)
.. నరుకుర్తి శ్రీధర్
విశాఖపట్టణం
ఇవి కూడా చదవండి :
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
మన విలువను వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవడం అవసరం
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
అవినీతి కేసుల్లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి .. తర్వాత ఎపీ సీఎస్ అవుతారా?
.

Discussion about this post