నగరి నది నుంచి ఇసుకను అక్రమంగా తమిళనాడుకు తరలించడాన్ని అధికారులు అడ్డుకోవాలని తేదేపా పట్టణ అధ్యక్షుడు జి రమేష్ బాబు డిమాండ్ చేశారు.
నగరిలోె శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకవైపు నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు.
నగరిలో ఇసుక రీచ్ లేకపోయినా అధికార పార్టీ నాయకుల అండతో అక్రమంగా ఇసుకను టిప్పర్ లతో తమిళనాడు కి తరలించి భారీగా విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని అధికార పార్టీకి అధికారులు తొత్తులుగా వ్యవహరించడం సరికాదన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్ర నుంచి వెళ్లిన ఇసుకను తమిళనాడులో పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేశారని ఈ మేరకు తమిళ వార్తాపత్రికల్లో వార్తలు రావడం జరిగిందని ఇప్పటికైనా నగిరి లో పోలీసులు మైనింగ్ శాఖ రెవెన్యూ శాఖ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో తేదేపా చిత్తూర్ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శి ఆర్ బాలాజీ, నాయకులు యుగంధర్, అల్లు ముక్కు శ్రీనివాసన్, మహేంద్ర బాబు, మనీ కృష్ణారెడ్డి కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
.