కరోనా శాపమైంది. ‘బతుకు’ పోయింది. నిరుద్యోగిగా మారాడు. అమ్మ, అక్క అకాల మరణం వేధించింది. నాన్న ఉన్నప్పటికీ ఒంటిరి తనమే. ఈ బాధల నుంచి బయట పడటానికి ఉద్యోగం అన్వేషించాడు. ఎట్టకేలకు ఇంటర్వ్యూ తేదీ కూడా ఖరారైంది.
అంతలో ఏం జరిగిందో కానీ… ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్సడ్డాడు. ఈ సంఘటన బుధవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాళహస్తి పట్టణం హరహరబావి ప్రాంతంలో నివసించే మునిరాజ కుమారుడు జగదీష్ (28) సాఫ్ట్ వేర్ ఇంజనీరు గా పని చేసే వాడు. కరోనా కారణంగా అతడు ఉద్యోగం కోల్పోయాడు. ఉపాధి కోల్పోయిన తరువాత ఇంటికి వచ్చాడు.
అప్పటి నుంచి సుమారు ఏడాదిన్నరగా అతనికి ఉపాధి లేదు. ఇదిలా ఉండగా జగదీష్ తల్లి అనారోగ్యంతో ఐదేళ్ల కిందట మృతి చెందింది. ఇక జగదీష్ అక్క కొంతకాలం కిందట కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి జగదీష్, ఆయన తండ్రి మునిరాజ మాత్రమే ఇంట్లో ఉంటున్నారు.
మునిరాజ కుటుంబ పోషణ కోసం కూలీ పనులకు వెళుతుంటాడు. దీంతో జగదీష్ ఒంటరిగా ఇంట్లో ఉండేవాడు. ఈ ఒంటరి తనం ఆ యువకుని బాగా కుంగదీసింది. మొదట వచ్చిన ఉద్యోగం కోల్పోవడంతో.. మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు. అయితే త్వరగా అతనికి ఉద్యోగం దొరకలేదు.
హైదరాబాదులో ఒక ఉద్యోగం కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. సదరు కంపెనీ వారు ఇంటర్వ్యూ కు హాజరు కావాలని కోరారు. ఇందుకోసం జగదీష్ హైదరాబాదు వెళ్లాల్సి ఉంది. ఇంతలో ఏం జరిగిందో కానీ.. ఆ యువకుడు తన ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటర్వ్యూ కు వెళ్లడానికి అతని స్నేహితులు జగదీష్ కు ఫోన్ చేశారు. అయితే అతడు ఫోన్ ఎత్తలేదు. నేరుగా వెళ్లి విషయం తెలుసుకుందామని అతని స్నేహితులు వెళ్లారు. జగదీష్ ఇంటి వద్దకు వెళ్లి ఎంత పిలిచినా పలకలేదు. అనుమానం వచ్చి తలుపులు పగుల గొట్టి చూడగా.. జగదీష్ ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు.
వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. జగదీష్ తండ్రికి విషయం చెప్పారు. అనంతరం పోలీసులు వచ్చి జగదీష్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరోనా తో ఉద్యోగం పోవడం.. ఒంటరి తనం భరించ లేక ఈ యువకుడు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
.