చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు జలగం శ్యాం సుందర్ నాయుడును శుక్రవారం విజయవాడలో ఘనంగా సన్మానించారు.
మిజోరం గవర్నరు కంభంపాటి హరిబాబు చేతుల మీదుగా ఈ సన్మానం జరిగింది.
గో ఆధారిత వ్యవసాయం చేసి మంచి దిగుబడులు సాధించినందుకు శ్యాం సుందర్ నాయుడుకు గో-ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం వారు ఉత్తమ రైతు అవార్డు ప్రకటించి ఈ సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి రైతు పురుగు మందులు వాడకుండా గో ఆధారిత సేద్యం చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు.
ఇలాంటి ఉత్పత్తుల వలన ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన రైతులందరికీ తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ విజయకుమార్, ఉద్యానవన శాఖ కమిషనరు శ్రీధర్, ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ శ్రీధర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ ఆంజనేయులు,ఆర్.ఎస్.ఎస్ ప్రాంత ప్రచారక్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
.