జీవితంలో ఎదురయ్యే భిన్న అనుభవాలు, అనుభూతులు, బాధానందాలు.. మనకు జీవితాంతం గుర్తుంటాయి. మరో రకంగా చెప్పాలంటే.. ఈ జ్ఞాపకాలు, స్మృతులు అనేవే జీవితంలోని వేర్వేరు దశలలో మనల్ని అనేకరకాలుగా ప్రభావితం చేస్తుంటాయి. మనల్ని ముందుకు నడిపిస్తుంటాయి. మనం ముందడుగు వేయడానికి చైతన్యాన్ని అందించినట్టే, నైరాశ్యంతో కమ్మేసి మనల్ని వెనక్కు లాగుతుంటాయి కూడా.
జ్ఞాపకాల ప్రభావంలో పడకుండా ముందుకు సాగడం అస్సలు జరగదు. జ్ఞాపకాలు మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటాయి. అయితే, జ్ఞాపకాలలో మధురానుభూతులను పదిలంగా దాచుకుని, చేదుగుళికలను నెమ్మదిగా మరచిపోవడం మంచిది. మనసుకు కలిగిన బాధను మరచిపోవడం సూక్తులలో చెప్పినంత సులువు కూడా కాదు. కానీ ప్రయత్నం మీద అసాధ్యం కూడా కాదు.
ఈ విషయాన్ని మనకు ఓ సుభాషితం ఈ విధంగా చెబుతుంది..
ఉపకారాన్ స్మరేన్నిత్యమ్ అపకారాంశ్వ విస్మరేత్
శుభే శైధ్రయం ప్రకుర్వీత అశుభే దీర్ఘసూత్రతా
మనకు ఇతరులు చేసిన మంచి పనులను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఇతరులకు మనకు చేసిన, తలపెట్టిన కీడును ఎప్పటికప్పుడే మరచిపోవాలి. మంచి పనులు చేయదలచుకుంటే ఉన్నపళంగా చేసేయాలి. చెడు పనులు చేయాల్సి వస్తే.. వాటిని వీలైనంత వరకు వాయిదా వేస్తూ సాగదీస్తూ పోవాలి. –అనేది శ్లోకభావం.
ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి- మంచి, చెడు జ్ఞాపకాలు. రెండు- మంచి, చెడు పనులు! వీటిని విడివిడిగా చూద్దాం.
1. మంచి, చెడు జ్ఞాపకాలు
ఇతరులతో సంబంధాలు కొనసాగించే విషయంలో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన సూత్రం ఇది. మరొకరి మీద నింద వేయడం, తప్పును మరొకరి మీదకు ఆపాదించడం అనేది మానవ సహజమైన అలవాటు. ప్రతిఒక్కరికీ ఎంతో కొంత ఇలాంటి అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ముదిరే కొద్దీ.. మనకు జరిగే కీడుకు ఇతరులు కారణం అని నెపం వేసే తత్వం పెరిగే కొద్దీ.. ఇతరులు చేసిన మంచిని మరచిపోతూ ఉంటాం. బంధాలు బలపడాలంటే.. ఇతరులు మనకు చేసిన మంచిని గుర్తుంచుకోవాలి. వారు చేసిన కీడును మరచిపోవాలి. అలాంటి పని మనం మరొకరికి చేయకుండా ఉండాలని అనుకోవాలి.
‘అపకారాలను మరచిపోవాలి’ అని సుభాషితం చెబుతున్న వాక్యాన్ని మరో తీరుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ‘అపకారం’ అంటే ఖచ్చితంగా ఇతరులు చేసి ఉండాల్సిందే అనుకోనక్కర్లేదు. జీవితంలో మనకు ఎదురైన వైఫల్యాలు, పరాజయాలు, ఎదురుదెబ్బలను కూడా ‘అపకారం’గా పరిగణిస్తే ఈ సుభాషితం భావం.. ఇంతకంటె గొప్పగా మనకు అందుతుంది.
ALSO READ
చిరు చెల్లెలిగా ఆమె తప్ప మరో ఆప్షన్ లేదు
అమరావతి మహాపాదయాత్రలోకి జనసేనాని పవన్ కల్యాణ్
కుప్పంలో వార్డుల వారీగా వైసీపీ మెజారిటీలు ఇవే!
మనం ఏదైనా ఒక గొప్ప పనిని, మన శక్తికి మించిన పనిని సంకల్పించాం అనుకోండి.. అందుకోసం కష్టపడుతున్న సమయంలో- గడచిపోయిన జీవితంలో మనకు ఎదురైన కష్టాలు- వాటిని దాటి వచ్చిన వైనం.. గతంలో మనం సాధించిన ఘనకార్యాలు, శ్రమతో సాధించిన విజయాలు ఉంటే వాటిని గుర్తు చేసుకోవడాన్ని మించిన స్ఫూర్తిదాయక వ్యవహారం ఇంకొకటి ఉండదు.
ఎవరో సాధించిన విజయాలనుంచి మనం స్ఫూర్తి అందుకోవడం ఒక ఎత్తు. కానీ మన సొంత విజయాలను మననం చేసుకుంటే- ఆ స్ఫూర్తి మన శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకంగా కూడా మారి మనల్ని ముందుకు నడిపిస్తుంది.
ఇదే తరహాలో.. వ్యక్తిగత పరాజయాలను మరచిపోవడం కూడా. మరో రకంగా చూసినప్పుడు మనకు తగిలిన పరాజయాలనుంచి మనం పాఠం నేర్చుకోవాలి కదా! మరి మరచిపోతే ఎలాగ? అనే అనుమానం మనకు రావొచ్చు. ఇది నిజమే.
మనం మరచిపోవాల్సింది అచ్చంగా పరాజయాల్ని కాదు. ఓటమి గుర్తుంటే అందుకు దారితీసిన కారణాలు కూడా గుర్తుండి మనల్ని అలర్ట్ చేస్తాయి. కానీ.. ఆ ఓటమి కలిగించిన నైరాశ్యాన్ని మాత్రం మనం మరచిపోవాలి. అది గుర్తున్నంత కాలం.. మరో పని చేయినివ్వకుండా వెనక్కు లాగుతుంటుంది.
2. మంచి, చెడు పనులు
‘రేపటి పనిని ఇవాళే చేయ’మని మహాత్మా గాంధీ చెప్పిన జీవన వేదం మనందరికీ తెలుసు. ఇది మంచి పనులకు మాత్రమే వర్తిస్తుంది. సత్కర్యాలను తక్షణమే చేసేయాలి. కాలయాపన, జాప్యం చేయడం తగదు. ఈ విషయంలో కర్ణుడికి సంబంధించిన కథ ఒకటి మనకు తెలుసు.
కర్ణుడు స్నానానికి వెళుతూ దేహానికి నూనె పట్టిస్తున్న సమయంలో ఓ వృద్ధుడు వచ్చి దానం అడిగాడుట. ఆ సమయానికి కర్ణుడు ఎడమచేతిలో బంగారు నూనెగిన్నె ఉంచుకుని- కుడిచేత్తో దానిని దేహానికి అలముకుంటున్నాడు. ఆ వృద్ధుడు అడిగిన వెంటనే కర్ణుడు.. తన ఎడమచేతితోనే ఆ బంగారు గిన్నెను అతనికి ఇచ్చేశాడు.
‘ఇదేంటి కర్ణా.. ఎడమచేత్తో దానం తగదు కదా’ అడిగాడు వృద్ధుడు.
‘కావొచ్చు. కానీ ఎడమచేతిలోంచి కుడిచేతిలోకి ఆ బంగారు పాత్రను తీసుకునేలోగా నా మనసు మారుతుందేమో. దానం ఇవ్వదలచుకున్నప్పుడు తక్షణమే ఇచ్చేయాలి’ అన్నాడట కర్ణుడు.
ఇవి కూడా చదవండి :
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
ఆ రకంగా మంచి పని చేయదలచులకుంటే వెంటనే చేయాలి. జాప్యం వద్దు అనే ఈ సుభాషితం కూడా చెబుతుంది.
అలాగే.. చెడ్డపని చేయవలసి వచ్చినప్పుడు- అంటే ఇతరులకు కీడు తలపెట్టడం అనే కాదు.. మన ఇష్టానికి వ్యతిరేకంగా నచ్చని పని ఏదైనా అనివార్యంగా చేయాల్సి రావొచ్చు. ఆ పని చేయడంలో వీలైనంత జాగు చేయాలి. సాగతీయాలి. అందుకే ‘అశుభే దీర్ఘసూత్రతా’ అని చెబుతుంది సుభాషితం.
ఒక్క సుభాషితం రెండు రకాలుగా మనకు ఉత్తమ జీవన విలువలను బోధిస్తుంది. మన విచక్షణను తీర్చిదిద్దుతుంది. ఈ సుభాషితం నుంచి.. మనం జీవితంలో ‘మరచిపోవలసినది’ ఏమిటో జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి!
శుభోదయం
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post