హీరోగారు రెండో కంటికి తెలియకుండా సినిమా షూటింగ్ కోసం వచ్చారు. ఎక్కడో ఓ లేఅవుట్ లో నిరాటంకంగా షూటింగ్ చేస్తూ వచ్చారు. మరో రెండు రోజుల్లో తిరిగి హైదరాబాదు వెళ్లిపోతాం అనుకుంటూ ఉండగా.. హఠాత్తుగా వరదలు ముంచెత్తాయి. వారు ఉంటున్న లే అవుట్ మొత్తం జలమయం అయి, నీటి మడుగులా మారిపోయింది. నీటి మధ్యలో చిక్కుకుపోయి.. దేవుడా అంటూ బిక్కు బిక్కుమంటూ గడిపారు.
ఇదంతా ఓ నందమూరి హీరోకు పట్టిన దుర్గతి.
నందమూరి తారకరత్న పెద్దగా హిట్లు లేకపోయినా వరుసగా చిన్న సినిమాలు చేస్తూనే ఉంటారు. ఈ హీరో ఇటీవల నెల్లూరు జిల్లా కు షూటింగ్ నిమిత్తం వచ్చారు. సీక్రెట్ గా వచ్చారు- అయితే వరదల వల్ల అంతా బహిరంగం అయిపోయింది.
నందమూరి తారకరత్న సినిమా షూటింగ్ నిమిత్తం నెల్లూరు వచ్చారు. కోవూరు లోని సాలుచింతల గ్రామంలోని ఓ లేఅవుట్ లో 20 రోజులు నుంచి నిర్విరామంగా సినిమా షూటింగ్ చేశారు. వారం రోజుల పాటు అక్కడే షూటింగ్ నిర్విఘ్నంగా జరుగుతూనే ఉంది.
ఉన్నపళంగా అల్పపీడన ద్రోణి కారణంగా భారీ వర్షాలు రావడంతో సోమశిలలో నీటి ఉధృతి పెరిగింది. ప్రవాహం పెన్నా నది కి చేరింది. దీంతో నెల్లూరు, కోవూరుకు పరవళ్లు తొక్కుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

లేఅవుట్ లో చిక్కుకుపోయిన హీరో తారకరత్నను ఇతర సినిమా బృందాన్ని అగ్నిమాపక శాఖ అధికారులు క్షేమంగా బయటకు తరలించారు. అక్కడినుంచి ప్రత్యేకంగా పడవల్లో వారిని మెట్టాప్రాంతాలకు తీసుకువెళ్లారు. అక్కడినుంచి దేవుడా అంటూ హీరో నందమూరి తారకరత్న హైదరాబాదు బయల్దేరి వెళ్లారు.
.

Discussion about this post