ఎదుగుదల అనేది జీవలక్షణం. నిన్నటికి నేటికీ ఎంతో కొంత ఎదగాలని ప్రతి మనిషీ కోరుకుంటాడు. ఎదగలేకపోతే నిరాశపడి, నిస్పృహలో కూరుకుపోతాడు కూడా. అయితే ‘ఎదుగుదల’ కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరం అవుతుంది. ఎలాంటి సందర్భాలు అవి?
నిజానికి తమ తమ రంగాల్లో ఎంతెంతో ఎత్తులకు ఎదిగి శిఖరాలను అధిరోహించాలని, ఎదిగి శిఖరంపై తానొక్కడే నిలబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే శిఖరాన్ని చేరుకున్న తరువాత మరెక్కడికి ఎదుగుతారు? శిఖరం మీదికి ఎదగడానికి ఆరాటపడుతూ ఉండే ఇంకా అనేకమంది చేరుకునే ఆ ప్రయత్నంలోనే ఉండగా.. ఆ శిఖరం మీద ఉండే అతి చిన్న స్థానాన్ని పదిలంగా ఎలా కాపాడుకుంటారు? ఎంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు? ఇవన్నీ కూడా ప్రశ్నలే.
శిఖరం మీదికి చేరిన వారు ఎప్పటికైనా మళ్లీ దిగక తప్పదు అని అనేక అనుభవాలు చెబుతుంటాయి. అలా శిఖరందాకా ఒంటరిగా ఎదిగిపోతే, తోసేయడానికి చూసేవాళ్లు ఎక్కువైపోతారు. పడిపోయే ప్రమాదమూ జాస్తి.
అయితే దీనికి పరిష్కారం ఏమిటి? శిఖరాన్ని అధిరోహించేప్పుడు.. విజయాన్ని అన్వేషించేప్పుడు.. ఆ ఎదుగుదలను ఇంకా కొందరితో పంచుకోవడమే! ఒంటరిగా కాదు.. సమష్టిగా ఎదిగితే ఈ ప్రమాదం తగ్గుతుంది. ఒక శిఖరం మీది నుంచి ఒక వ్యక్తిని నెట్టివేయడానికి, ఒక జట్టును నెట్టివేయడానికి చాలా తేడా ఉంటుంది.
పైగా, ఒంటరిగా నిటారుగా ఎదిగిపోవడం కంటె.. జట్టుగా సమాంతరంగా ఎదగడంలో ఉండే ఒక రకమైన మజా స్వానుభవంలోకి వచ్చిందంటే గనుక.. అలా అందరితో కలిసి మెలిసి ఎదగడమే గొప్పగా, మిన్నగా ఎప్పటికీ అనిపిస్తుంటుంది. అందులో ఉండే సమష్టితత్వం, నిర్భీకత, ఒత్తిడి లేని అభివృద్ధి అన్నీ అనుభవంలోకి వస్తాయి.
చాణక్యుడు కూడా ఇదే విషయాన్ని ఇంకో రకంగా చెప్తాడు.
నాత్యన్తం సరళైర్భావ్యం గత్వా పశ్య వనస్థలీమ్
ఛిద్యన్తే సరళాస్తత్ర కుబ్జాస్తిష్టన్తి పాదపాః
ఈ శ్లోకం చాణక్యుడి నీతి శాస్త్రం లో ఉంటుంది.
మరీ ఎక్కువ పొడవుగా ఎదగడం మంచిది కాదు. అడవుల్లోకి వెళ్లి చూశామంటే గనుక, మరీ ఎక్కువ పొడవుగా పెరిగిన చెట్లని నరికి వేస్తుంటారు. అక్కడ పొట్టిగా అడ్డంగా పెరిగిన చెట్లన్నీ నిక్షేపంగా భద్రంగా అలాగే ఉంటాయి. .. అనేది శ్లోక భావం.
ఇవి కూడా చదవండి :
బద్వేలును వదిలించుకోవాలని మిత్రులిద్దరిలో ఆరాటం
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
అవినీతి కేసుల్లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి .. తర్వాత ఎపీ సీఎస్ అవుతారా?
నిటారుగా ఎదిగిన చెట్టుకు- ఎవరో నరికివేస్తారనేది ఒక్కటి మాత్రమే భయం కాదు. నిటారుగా ఎదిగినప్పుడు.. పెనుగాలులు తుపానుల వంటి వైపరీత్యాల తాకిడి కూడా ఆచెట్టుకే ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ ప్రమాదం వచ్చినా సరే.. ఒంటరిగా, నిలువుగా పెరిగిన చెట్టుగా ముందుగా నేలకు ఒరుగుతుంది. అదే అడ్డంగా కొమ్మలను పక్కలకు విస్తరింపజేసుకుంటూ.. విశాలంగా.. ఎత్తుగానూ, అదేసమయంలో అడ్డంగానూ కూడా పెరిగిన చెట్టు ఒకపట్టాన కూలదు. తుపానుల సమయంలో రోడ్ల మీద కూలిపోయే చెట్లను చూస్తున్నప్పుడు మనకు ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
అలా సమాంతరంగా, విశాలంగా పెరగడం అనేదే సమష్టిగా ఎదగడంలోని మర్మం. అదే భద్రం.
ఎదగాలనే లక్ష్యం ఉండాలి. మనం మాత్రమే ఎదగాలి అనే భావన ఉండకూడదు. మనతో పాటు ఇంకా కొందరు ఎదగాలి మనం ఒక జట్టుగా ఎదగాలి అనే భావన ఉంటే.. దానికి ఎప్పటికీ ఒక సుస్థిరత, అందులో నిశ్చింత ఉంటాయి.
.

Discussion about this post