పేదల మెడకు ఉరితాడుగా మారిన వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) విధానం రద్దు చేయాల్సిందేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర యాదవ్ డిమాండు చేశారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కార్యాలయం వద్ద సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఓటీఎస్ కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీదా రవిచంద్రయాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదలతో చెలగాటం ఆడుతోందన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చాయని…అయితే ఇంతవరకు ఏ ప్రభుత్వం పేదల నుంచి ఈ రుణాలు వసూలు చేసిన దాఖలాలు లేవన్నారు.
అయితే జగన్ ప్రభుత్వం మాత్రం ఎవరో నిర్మించి ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో పేదల నుంచి డబ్బు వసూలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి చెప్పాలని ఆయన డిమాండు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక పేదలకు ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లు కూడా పేదలకు పంపిణీ చేయకుండా జగన్ నిర్లక్యంభు చేస్తున్నారని ఆయన విమర్శించారు. శ్రీకాళహస్తిలో టీడీపీ హయాంలో ఎంతో ఆధునాతన వసతులతో నిర్మించిన ఇళ్లను పేదలకు పంపిణీ చేయక పోవడంతో ఆరు వేల ఇళ్లకు పైగా వృథాగా ఉండి పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అందరికీ ఇళ్లు పథకం కింద నిర్మించిన ఇళ్లలో… 2,900 పైగా పేదలకు కేటాయించినా… అవి ఇంతవరకు వారికి స్వాధీనం చేయక పోవడం జగన్ ప్రభుత్వ నిరంకుశ విధానానానికి నిదర్శనమన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను పేదలకు వెంటనే స్వాధీనం చేయాలని బీదా రవిచంద్ర యాదవ్ డిమాండు చేశారు. ఓటీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండు చేస్తూ ఈ నెల 23న జిల్లా కేంద్రాల్లో టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయకుమార్, రాష్ట్ర కార్యదర్శులు గాలి చలపతినాయుడు, దశరథాచారి, ఆ పార్టీ నేతలు చెంచయ్యనాయుడు, రెడ్డివారి గురవారెడ్డి, చక్రాల ఉష, కంఠా రమేష్, ప్రకాశ్ నాయుడు, రావిళ్ల మునిరాజానాయుడు, మిన్నల రవి, పోలూరు శ్రీనివాసులు రెడ్డి, ప్రమీలమ్మ, రేణుకమ్మ, జిలానీ బాషా, యాదగిరి, అస్మత్, తీర్థం వెంకటేశ్వర్లు, ప్రవీణ్, గోపి, నెమళ్లూరు బుజ్జి, ఢిల్లీ బాబు, ఆర్ముగం, కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా ధర్నా అనంతరం వీరు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనరు బాలాజీనాయక్ కు వినతిపత్రం సమర్పించారు. ఓటీఎస్ రద్ధు చేసి పేదలకు న్యాయం చేయాలని కోరారు.
.