రైతుల విషయంలో రాజకీయాలు వద్దని తెలుగుదేశం పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం శ్రీకాళహస్తి వ్యవసాయశాఖ సహాయ సంచాలకుల కార్యాలయం వద్ద అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ… రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులను రైతలకు అందరికీ ఇవ్వకుండా కేవలం అధికార పార్టీ వారికే ఇస్తున్నారని వారు ఆరోపించారు. దేశానికి అన్నం అన్నదాతను రాజకీయ కోణంలో చూడటం విడ్డూరంగా ఉందన్నారు.
గతంలో ఎన్నడూ ఇలా జరుగలేదన్నారు. ప్రస్తుతం డీఏపీ, పొటాష్, యూరియా ధరలు ఆకాశం అంటుతున్నాయని చెప్పారు. ఇలాంటి తరుణంలో రైతుకు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడం భావ్యం కాదన్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్నారు.
ఎరువుల దుకాణాల్లో ఒక్కోచోట ఒక్కో ధర ఉందన్నారు, ఈ విషయమై వ్యవపాయశాఖ సహాయ సంచాలకులకు ఫిర్యాదు చేసినా ఆయన స్పందించడం లేదన్నారు. తుఫాను కారణంగా పంటలు దెబ్బతినడంతో రెండవ సారి పంటలు వేస్తున్నారని వారు చెప్పారు. అసలే ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులకు ఇలా ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.
ఎరువులను పట్టణంలోని ప్రముఖ వ్యాపారుల గోదాముల్లో దాచుకుని అధిక రేట్లకు విక్రయిస్తుంటే అధికారులు చోద్యం చూడడం భావ్యం కాదన్నారు. రైతులకు ఎరువుల సమస్యను పరిష్కరించక పోతే వ్యవసాయశాఖ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాలిమురళి నాయుడు, ఏర్పేడు మండలం పార్టీ అధ్యక్షులు నైనారు పొన్నారావు, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు కామేష్ యాదవ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.