చేనేత బతుకులు చితికి పోతున్నాయి. తుఫాను వారి పాలిట శాపంగా మారింది. గాలిలో తేమ శాతం పెరిగి పోవడంతో… పట్టు ఉత్పత్తి చాలా తగ్గి పోయింది. ఫలితంగా పట్టు ధర ఆకాశానికి పెరిగిపోతోంది.
వారం రోజుల కిందట కిలో రూ.3,500 ఉన్న పట్టు ధర నేడు రూ.5,500కి చేరింది. ధర పెరిగినా పవర్ మగ్గాలు వారు మాత్రం పోటీ పడి కొంటున్నారు. చేతిలో మగ్గం నేసే వారు మాత్రం ఈ పోటీలో తట్టుకోలేక పోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తమ బతుకులు బజారులో పడటం ఖాయమని చేనేతలు వాపోతున్నారు.
చిత్తూరు జిల్లాలో వేలాది కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ముఖ్యంగా మదనపల్లె, తంబళ్లపల్లె, నగరి, శ్రీకాళహస్తి నియోజవర్గాల్లో ఈ పరిశ్రమ ఎక్కువగా ఉంది. గతంలో ఈ పరిశ్రమ కొంతమందికే పరిమితమై ఉండేది. అయితే నేడు కుల, మతాలకు అతీతంగా మగ్గం నేస్తూ బతుకులు వెళ్ల దీస్తున్నారు.
తాము నేసిన చీరలకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేక… పెట్టుబడి కూడా గిట్టక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్ఫడుతున్న సంఘటనలు మనం తరచూ వింటూనే ఉంటాం. మదనపల్లె ప్రాంతంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
అసలే చేనేత పరిశ్రమ ప్రస్తుతం పీకల లోతు కష్టాల్లో కూరుకు పోయింది. ఇలాంటి తరుణంలో వరుస తుఫానులు ఈ పరిశ్రమను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తున్నాయి. అక్టోబరు రెండవ వారంలో ప్రారంభమైన వర్షాలు ఇంకా వదలడం లేదు. అంటే దాదాపు రెండు నెలల పాటు ఎడతెరిపి లేని వర్షం కురవడంతో పడమట మండలాల్లో మల్బరీ పంటలు బాగా దెబ్బతిన్నాయి.
దానికి తోడు గాలిలో తేమ శాతం పెరగడం వలన పట్టు ఉత్పత్తి బాగా తగ్గి పోయింది. ప్రస్తుతం కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పట్టు దిగుబడి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ధర ఆకాశానికి పెంచేస్తున్నారు. పవర్ మగ్గాలు ఉన్న వారు ఎంత ధర అయినా పట్టు కొనుగోలు చేస్తున్నారు.
వారు యంత్రాల సాయంతో చీరలు నేస్తున్నందున వారికి గిట్టుబాటు అవుతోంది. అయితే చేతితో మగ్గాలు నేసే వారి పరిస్థితి నేడు కడుదయనీయంగా మారింది. వీరికి ఒక చీర నేయాలంటే సగటున మూడు లేదా నాలుగు రోజులు పడుతుంది. అదే పవర్ మగ్గాల వారు గంటల వ్యవధిలోనే చీర తయారు చేస్తారు.
దీనికి తోడు చేతితో నేసే చీర కంటే… పవర్ మగ్గంతో నేసే చీర నాణ్యంగా కనిపిస్తుంది. ఈ కారణంగా ఈ చీరలకే మార్కెట్ లో డిమాండు ఉంటోంది. అంతేగాకుండా చేతితో నేసే చీరల కంటే వీరు తక్కువ ధరకే ఇస్తున్నారు. వీరి లాగా చేతితో తయారు చేసే వారు విక్రయిస్తే నష్టాల్లో కూరుకు పోతారు. ఇలాంటి పోటీ కారణంగా చేనేతలు తీవ్రంగా నష్ట పోయి… అఫ్పుల ఊబిలో కూరుకు పోతున్నారు.
పట్టు ధర ఆకాశానికి పెరిగి పోవడంతో చాలా మంది మగ్గాలు పనికి విరామం ప్రకటించారు. పట్టు ధర తగ్గిన తరువాత మళ్లీ చూద్దామనే భావనలో వీరు ఉన్నారు. ఈ కారణంగా వందలాది కుటుంబాలు ఉపాధి కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. పట్టు ధర నియంత్రణ చేయక పోతే తాము శాశ్వతంగా ఉపాధి కోల్పోవలసి వస్తుందని చేనేతలు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
.